అమరావతిని, ప్రజా రాజధానిగా పిలుస్తున్న ప్రభుత్వం, ప్రతి కీలక పరిణామంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తుంది. అమరావతిలో రహదారులు, కూడళ్లకు పెట్టాల్సిన పేర్లను సూచించాల్సిందిగా ప్రజలను కోరింది. మన ఘన చరితను చాటే పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతోపాటు అమరావతిలో నిర్మితమవనున్న 9 థీమ్‌ సిటీల్లో... ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఉపకరించే సమాచారాన్ని ఇవ్వాలని కూడా సీఆర్డీయే వెబ్‌సైట్‌లో అభ్యర్థిస్తోంది.

రాజధానిలోని రహదారులు, వీధులు, కూడళ్లు, కార్యాలయ భవనాలు, ఉద్యానవనాలు, క్రీడా ప్రాంగణాలు, కళావేదికలు, అతిథి గృహాలు తదితరాలకు మన సంస్కృతి, వారసత్వం అద్దం పట్టే పేర్లను ఉంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నదులు, పర్వతాలు, నైసర్గిక విశేషాలు, ప్రాశస్త్య ప్రదేశాలు, చారిత్రక సంఘటనలు, రాజవంశాలు, రాజులు, వివిధ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన ప్రముఖులను గుర్తించి, ప్రజా రాజధానిగా రూపొందుతున్న అమరావతిలో సముచిత ప్రాధాన్యం కల్పించాలనుకుంటున్నారు.

మొత్తం ప్రక్రియలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తే అసలుసిసలైన పీపుల్స్‌ క్యాపిటల్‌గా రాజధాని రూపొందుతుందన్న అభిప్రాయంతో వారి నుంచి సలహాలు, సూచనలను సీఆర్డీయే ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రపంచంలో ఎక్కడ ఉండే తెలుగువారైనా తమ అభిప్రాయాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసే అవకాశాన్ని కల్పించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read