ntr cbn 18012017

తెలుగుదేశం వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ కలలను నిజంచేయటమే ఆయనకు సముచిత నివాళి అన్నారు. రామారావు చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్నికాపాడేందుకు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారానికి తెచ్చి నూరేళ్ల చరిత్రకలిగిన కాంగ్రెస్‌ను ఓడించిన మహానాయకుడని అన్నారు. ఎన్టీ రామారావు తెలుగుతేజాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని, తెలుగువారికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.

సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్ళుగా భావించిన ఎన్టీఆర్ ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఆశయంతో కిలో బియ్యం రూ.2 పథకాన్ని అమలుచేశారని అన్నారు. దేశంలో తొలిసారిగా పేదలకు పక్కాఇళ్లు నిర్మించిన ఘనత ఎన్టీరామారావుదేనని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలో జనతా పార్టీ ప్రయోగం తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటులో ఎన్టీఆర్ కృషి సదా స్మరణీయమని ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకున్నారు.

పేదల సంక్షేమం కోసం ఎన్టీరామారావు ప్రవేశపెట్టిన పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వం నెలకు రూ.200 సామాజిక పెన్షన్ ఇస్తే తమ ప్రభుత్వం రూ.1000 రూపాయలు చేసిందని అన్నారు. 5 రెట్లు పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, విభజనానంతర నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి కోసం దావోస్ లో పర్యటిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా.పరకాల ప్రభాకర్, ఎంపీ సి యం రమేష్, తెలుగుదేశం యూరోప్ విభాగం అధ్యక్షుడు జయకుమార్ గుంటుపల్లి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read