నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 900 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పరిపాలనా నగరి ‘మాస్టర్‌ ప్లాన్‌’ ఖరారైంది. అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్‌, హైకోర్టు, అధికారుల నివాస భవనాలు... ఇలాంటి కీలక నిర్మాణాలు ఏవి ఎక్కడుండాలో తెలిపే మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వ ఆమోద ముద్ర పడింది. అంతేకాదు... ‘ఐకానిక్‌’ బిల్డింగ్‌లా నిర్మించాలని తలపెట్టిన అసెంబ్లీ డిజైన్‌ కూడా దాదాపుగా ఖరారైంది.

అమరావతి పరిపాలనా నగర రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా, అధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు దాదాపు ఏకాభిప్రాయానికి, ఒక అవగాహనకు వచ్చారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనిపై నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి పలు మార్పులు, చేర్పులు సూచించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా వుండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన హైకోర్టు భవనం అంతగా ఆకట్టుకోవడం లేదని దానిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం వుండేలా చూడాలని నిర్దేశించారు. వీటికి నడుమ అమరావతి నగరమంతా వీక్షించేలా అత్యంత ఎత్తులో ప్రత్యేకంగా టవర్ నిర్మించాలని నిర్ణయించారు. రాజధానిలో ఐనవోలు వద్ద 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఇది పరిపాలనా నగరం మధ్యలో ఏర్పాటు చేసే టవర్‌కి అభిముఖంగా దక్షిణ దిశలో ఏడు కి.మీ. దూరంలో ఉంటుంది. టవర్‌కి అభిముఖంగానే ఉత్తరం పక్కన పరిపాలనా నగరంలో, కృష్ణా నది ఒడ్డున ఎత్తైన ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహం ఎత్తు నిర్ణయించాల్సి ఉంది.

సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే వుండాలని, వాటికి అభిముఖంగా నివాస సముదాయాలు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. పరిపాలన నగరంలో పూర్తిగా ప్రభుత్వ సొత్తు అని, ప్రైవేటు ఆస్తులకు ఎక్కడా చోటులేదని చెప్పారు. అన్నిరకాల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా అత్యంత అద్భుతంగా ఒక భవనాన్ని ప్రస్తుతం నిర్ణయించిన కన్వెన్షన్ సెంటర్ సమీపంలోనే నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్ హాల్ వుండాలని అన్నారు. నగరానికి రెండు వైపులా అతి పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్టీ, ఎమ్మార్టీ, ఈ బస్ వేల గురించి ముఖ్యమంత్రికి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు వివరించారు.

ఓవైపు పరిపాలనా భవంతులు, మరోవైపు సాధారణ ప్రజానీకం సందర్శించేలా కన్వెన్షన్ సెంటర్, సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్ సెంటర్, వాణిజ్య కూడలి, పార్కులు వుండాలంటూ తన ఆలోచనలను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. పరిపాలనా నగరంలో నిరంతరం నీటి ప్రవాహం వుండేలా చర్యలు తీసుకోవాలని, జస్టిస్ సిటీకి పక్కనే మరో నగరానికి చోటు కల్పించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు నివాస సముదాయాలపైనా చర్చ జరిగింది. రాజ్ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం రానుంది.

900 ఎకరాల పరిపాలనా నగరాన్ని నాలుగు బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకు ఒక కి.మీ. పొడవు, కిలో మీటరు వెడల్పు ఉంటుంది. దక్షిణం పక్కన ఉన్న మొదటి బ్లాకు మధ్య నుంచి పాలవాగు వెళుతుంది. ఈ బ్లాకులో దక్షిణం పక్కన మధ్యలో శాసనసభ భవనం వస్తుంది. ఎదురుగా పెరేడ్‌ గ్రౌండ్‌ ఉంటుంది. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు రెండో బ్లాకులో వస్తాయి. అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌ అధికారుల నివాసాలు కూడా ఇక్కడే ఉంటాయి. దీని మధ్యలో అర్బన్‌ పార్కు ఉంటుంది. మూడో బ్లాక్‌లో సెంట్రల్‌ పార్కు వంటివి ఉంటాయి. నాలుగో బ్లాకులో రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసాలతో పాటు స్పోర్ట్స్‌ అరెనా, కన్వెన్షన్‌ సెంటర్‌ వంటివి వస్తాయి. పరిపాలనా నగరానికి కొనసాగింపుగా దక్షిణం వైపు న్యాయ నగరం ఉంటుంది. దీన్ని రెండు బ్లాకులుగా డిజైన్‌ చేశారు. దీనిలో మొదటి బ్లాకులో హైకోర్టు భవనం, న్యాయమూర్తుల నివాసాలు, ట్రైబ్యునల్‌ భవనాలు ఉంటాయి. రెండో బ్లాకులో వాణిజ్య, నివాస సముదాయాలుంటాయి.

హైకోర్టు డిజైన్లపై సీఎం సూచించిన మార్పుచేర్పులను చేసి, తుది ఆకృతులను వచ్చే నెలాఖరుకల్లా సమర్పించనున్నారు. ఫైనల్‌ డిజైన్లు సిద్ధమైన వెంటనే టెండర్లను పిలిచి, 2 నెలల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణంపై ఆసక్తి ఉన్నవారి కోసం ఇప్పటికే ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌’ను పిలిచారు. వాటి డిజైన్లు ఖరారైన వెంటనే టెండర్ల ప్రకియ్ర ప్రారంభిస్తారు.

amaravati design 23052017 1

amaravati design 23052017 2

amaravati design 23052017 3

amaravati design 23052017 4

Advertisements

Advertisements

Latest Articles

Most Read