ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో పద్మావతి విశ్రాంత సముదాయంలో మనవడు దేవాన్ష్‌ తో సీఎం చంద్రబాబు అక్షరాభ్యాసం చేయించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు వచ్చిన చంద్రబాబు కుటుంబసమేతంగా శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామి సీఎం కుటుంబానికి కులదైవం కావడంతో వారి ఇంట ఏ శుభకార్యమైన ఆక్కడే జరుపుతారు. అంతకుముందు అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు కూడా స్వామి సన్నిధిలోనే తీశారు. ఇవాళ శ్రీవారి చెంతనే తమ వారసుడికి అక్షరాభ్యాసం చేయించారు. నారా కుటుంబం మొత్తం వేడుకలో పాల్గొంది.

దేవాన్ష్‌ చేత నూతన సంప్రదాయానికి అంకురార్పణ చేయించాం. అ... అంటే అమ్మ, ఆ... అంటే ఆంధ్రప్రదేశ్‌... అ... అంటే అమరావతి, ఆ... అంటే ఆనందం, ఆరోగ్యం, ఆదాయం అని... దేవాన్ష్‌తో రాయించాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని, తిరుపతిని ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

అక్షరాభ్యాసం అనంతరం కుటుంబ సమేతంగా వైకుంఠం-1 మీదుగా క్యూలైన్‌ మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుని మండపంలో పండితులు వారికి వేదాశీస్సులు అందించారు. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వారికి ప్రసాదం అందజేసి సత్కరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read