రాష్ట్రాన్ని సుభిక్షం చేసే శక్తిసామర్ధ్యాలు పోలవరం ప్రాజెక్టుకు వున్నాయని, ఏడాది పాటు వర్షాలు లేకున్నా, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా నీటి సమస్య తలెత్తే అవకాశమే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని 2018 కల్లా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరందించి తీరతామని చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు లేనంతగా అత్యంత పొడవైన అప్రోచ్ చానల్, అత్యంత ఎత్తయిన గేట్ల ఏర్పాటు, అత్యంత లోతు నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పోలవరం ప్రాజెక్టు ఘనతలుగా పేర్కొన్నారు. చైనా త్రీగోర్జెస్‌ ప్రాజెక్టుకు ఏమాత్రం తీసిపోదని చెప్పారు.

సోమవారం శాసనసభ కమిటీహాలు-2లో పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో పోలవరం, అమరావతి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం నుంచి ఏయే ప్రాజెక్టులకు ఎలా నీటిని తరలిస్తాం, ఎలా వినియోగించుకుంటాం అనే అంశాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వయంగా ముఖ్యమంత్రి వివరించారు. సోమవారం అంటేనే పోల‘వారం’ అనుకునేంతగా ముద్రపడిపోయేలా ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్టు చెప్పారు.

హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ఇలా రాయలసీమలో ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసేందుకు పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 40 టీఎంసీల నీటిని రిజర్వాయరులో భద్రపరిచి, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తరలిస్తామన్నారు. అమరావతికి ఎగువన 10 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజ్ నిర్మాణానికి యోచిస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి అమరావతి నగర భవిష్యత్ నీటి అవసరాలను ఈ నిర్మాణంతో తీర్చాల్సి వుందన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా ఆర్ధిక సహకారం అందుతోందని, ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని ముఖ్యమంత్రి అన్నారు. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుకుండా రాష్ట్రానికి ఉపకరించేలా చేయాలన్నదే తన సంకల్పంగా చెప్పారు. భూసేకరణకు పెద్దమొత్తంలో పరిహారం అందిస్తున్నామని దీంతో అంచనా వ్యయం పెరిగిందని అన్నారు.

అటు అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని, స్పిల్ వే - స్పిల్ చానల్ తదితర నిర్మాణాల వివరాలను సభ్యులకు ఆసక్తి కలిగిలా అధికారులు తెలియజేశారు. వివిధ దశలుగా జరుగుతున్న పనులను చీఫ్ ఇంజినీర్ రమేష్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఆకృతుల ఆమోదం దగ్గర నుంచి నాణ్యత పరిశీలన వంటివి సెంట్రల్ బోర్డు పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడటం లేదని ఉభయ సభల సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం పనులతో పాటు గేట్ల ఫాబ్రికేషన్ పనులు సమాంతరంగా సాగుతున్నాయని ఇంజినీరింగ్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరావు చెప్పారు.

కుడి కాలువ, ఎడమ కాలువ, హెడ్ వర్క్‌తో కలిపి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 40.65% పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అన్నారు. పోలవరంతో విశాఖకు 23.44 టీఎంసీల నీటిని తరలించడం, 540 గ్రామాల్లో 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడం వంటి ప్రయోజనాలు వున్నాయని అన్నారు. పొరుగు రాష్ట్రాలకు పోలవరం వరప్రదాయనిగా అభివర్ణించిన శశిభూషణ్ ఒడిశాకు 5 టీఎంసీలు, చత్తీస్‌గఢ్‌కు 1.5 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు అవకాశం వుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో లబ్ది పొందుతుందని అన్నారు.

మరోవైపు పోలవరం సత్వరం పూర్తి అయ్యేలా దేవుణ్ణి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రోజూ ఒక్క నిమిషం అయినా ప్రార్ధించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ‘పోలవరం అవగాహన సమావేశం’ అనంతరం, ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ వారం రోజులు జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో మంత్రులు, ఉభయసభల సభ్యులు, జలవనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ గుప్తా, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read