సైబర్ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్ కార్డ్ సంస్థ ముందుకొచ్చింది. విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం (ఇన్నోవేటీవ్ డెవలప్‌మెంట్ సెంటర్) ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది. బుధవారం విజయవాడ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన మాస్టర్ కార్డ్ గ్లోబల్ సీఈవో అజయ్ బోంగా ఏపీలో తమ ప్రణాళికలపై చర్చించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు యూనివర్శిటీ విద్యార్థులకు ఉపకరించే ల్యాబ్ ఏర్పాటుకు అంగీకారం తెలియజేశారు. అమెరికాలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటులో ముఖ్య భూమిక వహించిన మాస్టర్ కార్డ్ గ్లోబల్ అక్కడ ఏ తరహా సాంకేతిక పద్ధతులను అమలుచేశారో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవే విధానాలను పరిచయం చేస్తామని అజయ్ ముఖ్యమంత్రికి చెప్పారు.

రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకు సంబంధించిన వివరాల దగ్గర నుంచి క్రయ విక్రయాలు జరిపే భూముల వివరాల వరకు సమస్తం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, ఇటువంటి నేపథ్యంలో ఏపీకి సైబర్ సెక్యూరిటీ ప్రాథాన్యమైన అంశంగా మారిందని ముఖ్యమంత్రి వివరించారు. రియల్ టైమ్ గవర్నన్స్‌లో భాగంగా ఇ-ప్రగతి కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలుచేస్తున్నామని, ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని సంపూర్ణంగా డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారు. సాంకేతిక అభివృద్ధికి సమాంతరంగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సమాచారం మొత్తాన్ని భద్రంగా, సురక్షితంగా వుంచడం అవసరంగా భావిస్తున్నామని తెలిపారు. మాస్టర్ కార్డు తమకు ఈ విషయంలో సహకారం అందించాలని కోరారు.

విశాఖలో త్వరలో ఎథికల్ హాకర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచదేశాలకు చెందిన అనేకమంది టెక్నోశావీలు పాల్గొంటారని అజయ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఒక ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ రూపొందించడానికి సిద్ధంగా వున్నామని ఆయన తెలిపారు. పంట వివరాలు మొదలు పొలానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు, చివరికి ఉత్పత్తులను సైతం మార్కెటింగ్ చేసుకునేందుకు వున్న అవకాశాలను వివరిస్తూ ఈ అప్లికేషన్ రైతు మిత్రునిగా వుంటుందని చెప్పారు. విశాఖపట్నం, అమరావతి నగరాలలో ఎక్కడైనా ఇన్నోవేటీవ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీయం కోరగా, ఫిన్ టెక్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న విశాఖలో త్వరలో ఈ సెంటర్ ఏర్పాటు చేయగలమని మాస్టర్ కార్డు సీఈవో చెప్పారు. సమావేశంలో ఐటీ కార్యదర్శి విజయానంద్, ఐటీ సలహాదారు జెవిఎస్ చౌదరి, కమ్యూనికేషన్స్ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న, తిరుమలరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read