ఈ శతాబ్దంలోనే అద్భుతమైన నగరంగా చెప్పకునే ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిని తెలుగు సంస్కృతి, చరిత్ర వారసత్వ సంపదలకు ప్రతిబింబంలా తీర్చిదిద్దడానికి తగిన నిర్మాణ రీతులన్నింటినీ క్రోడీకరించాలి అని డాక్టర్ పరకాల ప్రభాకర్ సారధ్యంలోని నిష్ణాతుల కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధ్యయనం, సేకరణ, సమాలోచన, రూపపకల్పన ప్రక్రియలను సత్వరం పూర్తి చేసి ప్రధాన ఆకృతులను సిద్ధం చేసే నార్మన్ పోస్టర్డ్ సంస్థకు అందించడానికి కమిటీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇందులో భాగంగా విజయవాడలో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తోంది. తొలి రోజు సమావేశం విజయవాడలోని సీఆర్డీఏ సమావేశ మందిరంలో డాక్టర్ పరకాల అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నవీన రాజధాని నిర్మాణంలో తెలుగు వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతులను ఎలా అంతర్భాగం చేయాలనే అంశంపై సమాలోచన సాగించారు. నవ నగర సమాహారంగా ఉండే అమరావతికి నగర ముఖద్వారాలు ఎలా ఉండాలి, నిర్మాణ శిల్పం ఎలా అమరాలి..? నిర్మాణ శైలిలో మన సంస్కృతి, వారసత్వసంపద, చరిత్రలను ఎలా నిక్షిప్తంచేయాలనే అంశం పై ఈ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తుందని, నార్మన్ పోస్టర్డ్ సంస్థ తుది ఆకృతిలో ఇవన్నీ పొందుపర్చడానికి వీలుగా సాధ్యమైనంత వేగంగా ఈ బాధ్యతల్నిపూర్తిచేయాల్సి ఉంటుందని నిష్ణాతుల కమిటీ సారధి డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు.

9 నగరాల్లో ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకతతో ఉంటుందని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని సూచనలు చేయాలని కోరారు. రాజధాని శంకుస్థాపనకు దేశం నలుమూలల నుంచి అలాగే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, వార్డుల నుంచి మట్టి, పవిత్ర జలాలు తీసుకువచ్చారని గుర్తుచేస్తూ ప్రజలందరి ఉమ్మడి భాగస్వామ్యంతో ప్రజా రాజధాని నిర్మాణం సాగుతుందని చెప్పారు. మన రాజధానిలో మన సంస్కృతి ప్రతిబింబించాలన్నది రాష్ట్ర ప్రజలందరు ముక్త కంఠంతో కోరుకుంటున్నారని చెప్పారు. దానికి అవసరమైన సూచనలు చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటయిందని తెలిపారు.

భారతీయ సంస్కృతి, ముఖ్యంగా ఆంధ్రసంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణ శైలి ఉండాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయాన్నివ్యక్తం చేశారు. రాజధానికి దారి తీసే రాహదారులకు, భారీ భవంతులకు, ఇతర ముఖ్య కట్టడాలకు మన చరిత్రను స్పూర్తించేలా తగిన నామకరణం చేయాలని కూడా సమావేశం అభిప్రాయపడింది. ప్రాచనీ కాలం నుంచి ఆధునిక కాలం నుంచి అన్ని ప్రాంతాల సంస్కృతి ప్రతిఫలించాలని కొందరు సూచించారు.

ఈ ప్రాంత ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేసుకోవాలని కొందరు సూచించారు. రహదారి కూడళ్లలో రాతి నిర్మాణాలు ఉంటే కళ్లకు ఇంపుగా ఉంటాయనే భావన వ్యక్తమైంది. పరిపాలన భవనాలకు చారిత్రక నామాలు పెట్టాలని ప్రతిపాదించారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన అమరావతిని అనేక శాతావాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు సహా అనేక రాజవంశాలు పరిపాలించాయని, అలాగే కొద్ది కాలం పాటు బౌద్ధం విలసిల్లిందని, ఆ సంస్కృతి సంప్రదాయాలన్ని నిర్మాణ శైలిలో ప్రతిఫలించాలని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంత్ చౌదరి చెప్పారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చతురస్ర ఆకారంలో ఉండాలని, పరిపాలన భవనాలకు సంబంధించి మన తెలుగు రాజుల వారసత్వ సంపద కళ్లకు కట్టేలా చూడాలని సూచించారు.

నగరం మొత్తం ఒకే వర్ణంలో ఉంటే అద్భుతంగా ఉంటుందని సినీ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చెప్పారు. భవంతులు వెలుపలి భాగంలో కనీసం 5 అంశాలు మన సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించేలా ఉంటే చాలునని, భవనాల ఇంటీరియర్లో మన చరిత్రను తీసుకోవచ్చునని ఆనంద్ సాయి చెప్పారు. అక్కడక్కడ రాతి మండపాల నిర్మాణాలు ఉండాలని చెప్పారు. ఆంధ్ర చరిత్ర అంటే అందులో ఉత్తరాంధ్ర చరిత్ర ఉండడం లేదని, కొత్త రాజధానిలోనైనా కళింగ సామ్రాజ్యపు ఆనవాళ్లు ఉంటే న్యాయం చేసినట్లు అవుతుందని సాంస్కృతిక శాఖ విజయభాస్కర్ అన్నారు. నాలుగు, ఐదు బౌద్ద జాతక కథలలో కళింగ పట్టణం ఓడరేవు ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. కొత్త రాజధానిలో కళింగ సంస్కృతి, వారసత్వం కనిపించాలని చెప్పారు. తెలుగురాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంస్కృతిని కొత్త రాజధాని నిర్మాణం ప్రతిఫలించాలని చరిత్రకారుడు ఈ శివనాగిరెడ్డి అన్నారు. చరిత్రలో చిన్న చిన్న తెలుగు సామ్రాజ్యలు అనేకం ఉన్నాయని, ఆయూ సంస్కృతులన్నీ రాజధానిలో ఎక్కడో అక్కడ కనిపించేలా నిర్మాణాలు చేయాలని చెప్పారు.

ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను తీడ్రి మోడల్ నమూనా చిత్రాలుగా రూపొందించివాటిని నార్మన్ ఫోస్టర్డ్ సంస్థకు అందించాలని అమరావతి హెరిటేజ్ సిటీ సలహాదారు గల్లా అమరేశ్వర్ చెప్పారు. రాజధానిలో 1800 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాలు ఉంటాయని, అందులో 600 కి.మీ ప్రధాన రహదారులు ఉంటాయని సీఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారి చెప్పారు. రీజనల్ ట్రాఫిక్ కోసం 3 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నట్లు ఆయన కమిటీ సభ్యులకు వివరించారు. సమావేశనంతరం సభ్యులంతా క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం రాజధాన్ని ప్రాంతాన్ని సందర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read