ntr 21 2017

తెలుగు జనతకు వందనం
తెలుగు యువతకు అభినందనం
తెలుగు మమతకు అభివాదనం
తెలుగు జాతికి శుభాభినందనం
హరిజన గిరిజన దలిత వర్గాలు గూడాల్లో, అడవుల్లో, గుడెసెల్లో మగ్గిపోతూఉంటే చూచి భరించలేక
వెనక బడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుకు తొక్కివేయబడుతుంటే సహించలేక
జనభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక
రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్నకమై , దగాకోరు విధానమై
ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూఉంటే
గుండె బద్దలై , మనుసు వికలమై ఓరిమి పట్టలేక
మీ కోసం వచ్చాను అంటూ వెండితెర జీవితంలో నుండి ప్రజాజీవితంలోకి వచ్చిన తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం, తెలుగుజాతి ఖ్యాతికి సజీవ సాక్ష్యం అయిన దమూరి తారక రామారావుగారి 21వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి అర్పిస్తూన్నాము.

మన తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అంటే నందమూరి తారక రామారావుగారే. మూడువందలకు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ 'నటరత్న'గా, 'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ'గా బిరుదులు పొంది, పద్మశ్రీ, డాక్టరేట్ వంటి గౌరవాలను అందుకున్నారు. 1949లో 'మనదేశం' అనే చిత్రం ద్వారా మొదలై 1993 వరకూ కొనసాగిన తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రక, 55 జానపద, 44 పౌరాణిక చిత్రాలు చేసి భారతావని గర్వించదగిన కళాకారునిగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు.

ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి 1982లో 'తెలుగు దేశం' పార్టీని స్థాపించారు. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది. ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో, ఎన్టీఆర్ ఒక సంచలనం అయ్యారు. వర్ణ, వర్గ వివక్షలు ఏమీ అంటని మహోద్యమంలా పార్టీని ప్రజలే నడిపించారు. జనవరి 3వ తేదీ నుండి 70 రోజులపాటు అవిశ్రాంతగా రాష్ట్రమంతటా పర్యటించారు. 35000కి.మీ. తిరిగారు. మూలమూలకూ వెళ్ళి తన సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే ధోరణిలో వాళ్ల హృదయాలకు హత్తుకునేలా వినిపించారు.

అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన పాలన అందించడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్న ఎన్టీఆర్ ను విశ్వసించి ప్రజలాయనకు పట్టం కట్టారు. కేవలం 9 నెలల ప్రాయంగల ప్రాంతీయ పార్టీ, వందేండ్ల చరిత్రగల జాతీయపార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. కనివిని ఎరుగని ప్రజారాజకీయాలకు ఎన్టీఆర్ నాంది పలికారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పారు. 'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు' అంటూ ఒక ఆదర్శపాలనకు తెరతీశారు. సాటిలేని సంక్షేమ పాలనతో, స్వచ్ఛమైన రాజకీయాలతో తెలుగువారి పాలిట 'అన్నగారు' అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read