కృష్ణా జిల్లాలోనే కాక ఇరుగు పొరుగు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ తిరునాళ్లకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. సోమవారం రాత్రి మెట్టినింటి నుంచి అమ్మవారు బయలుదేరి మంగళవారం సాయంత్రం ఉయ్యూరు ప్రధాన రహదారి పై ఉన్న ఆలయానికి చేరుకుని ఈనెల 26 వరకు భక్తలకు దర్శనమిస్తారు. భక్తులు గండదీపాలతో మొక్కులు తీర్చుకుంటారు. తిరునాళ్ల ముగింపు రోజు రాత్రి ఆలయం నుంచి బయలుదేరి మెట్టినింటికి చేరుతుంది. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం తిరునాళ్ల ప్రాంరభం రోజున ఉయ్యూరు పట్టణ పోలీసులు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు.

తిరునాళ్లలో 11వ రోజైన, 16వ తేదీన జరిగే శిడిబండి వేడుక వైభవంగా జరుగుతుంది. కొబ్బరితోట ప్రాంతం నుంచి శిడిబండి బయలుదేరి శివాలయం రోడ్డు, ప్రధాన సెంటర్ మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

అమ్మవారి చరిత్ర
వీరమ్మతల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలుక పెద్ద కడియం గ్రామంలో బొడు పరుసురామయ్య, పార్వతమ్మ దంపతుల ముదుబిడ్డ శివ వీరమ్మకు ఎనిమిదో ఏట ఉయ్యూరుకు చెందిన పారుపూడి చలమయ్య చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో వివాహం జరిపించారు. వివాహానంతరం యుక్తవయస్సు వచ్చిన శివ వీరమ్మను కాపురానికి పంపారు. చింతయ్య వీరమ్మల సంసారం ఆనందంగా సాగుతున్న సమయంలో కరణం సుబ్బయ్య కళ్ళు వీరమ్మపై పడ్డాయి. ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ. ఆమెను లోబరుచుకునేందుకు సుబ్బయ్య చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతని బావమరిదితో చింతయ్యను హతమార్చేందుకు పధకం రూపొందించి చంపుతారు. ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది. తాను ప్రేమించిన భర్తతో సహ గమనం చేయాలని నిస్చయించుకొంది .

తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకొని, అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. ఆమె కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు. చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది. గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే, మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ముత్తైదువులు పసుపు దంచుతుంటే, రోలు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోటు వేసింది. ముత్తైదువులకు పసుపు, కుంకుమలు పంచి పెట్టింది. ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు భోరున విలపిస్తుండగా, అత్తా మామలు, బంధు గణం శోక సముద్రంలో మునిగి ఉండగా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలితో ,”పారెళ్ళు ”పెట్టించుకొని, పెళ్లి కూతురులా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించుకొని, సాధ్వీమ తల్లి, పతివ్రతా శిరోమణి, వీరమ్మ తల్లి, భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి, భగ భగ మండే ఆ మంటలో తానూ, భర్త చితి పై చేరి అగ్ని గుండంలో సహ గమనం చేసింది. ఆదర్శ మహిళగా, మహిమ గల తల్లిగా ఆ నాటి నుంచి, ఈ నాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకొంటోంది.

అందరూ ఆలోచించి, వీరమ్మ అత్త మామల తో సంప్రదించి, గ్రామస్తులతో సమావేశం జరిపి, సహగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ, చింతయ్యల విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం, అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్సవాలు ప్రారంబించటం జరుగుతోంది.

తిరునాళ్ళు పదిహేను రోజుల్లోను, ఉయ్యూరులో ఏ ఇంట్లోను పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు. ముందే సిద్ధం చేసుకొంటారు. కారం కూడా కొట్టరు. ఇవి స్వచ్చందంగా అందరు పాటించే నియమాలే. తిరునాళ్ళ రోజుల్లో, బంధువులను పిల్చుకొని విందు భోజనాలు ఏర్పాటు చేసుకొంటారు . ఆమె పవిత్రతను ఇలా తర తరాలుగా పాటిస్తూ, నేటికీ నిలబెట్టు కొంటున్నారు ఉయ్యూరు, పరిసర గ్రామాల ప్రజలు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read