మండల, జెడ్పీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీ చేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీతో పాటు దాఖలైన మరికొన్ని వ్యాజ్యాలపై విచారణను ఈనెల 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. గత ఏడాది నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని బలవంతపు ఉపసంహరణలు నిర్ధారణ అయితే ఆ నామినేషన్లను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ గత నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. బలవంతపు నామినేషన్ల ఉపసహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని 20వ తేదీకల్లా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రెస్ రిలీజ్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని వాటిని రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో భారీగా అక్రమాలు జరిగాయని స్వయాన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా కోరుతూ జనసేన పార్టీ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వీటిపై సోమవారం సింగిల్ జడ్జి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఎఈసీ ఆదేశాలు జారీ చేశారు. తాజా విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరుపు న్యాయవాది అశ్వనీకుమార్ మాట్లాడుతూ కౌంటర్ దాఖలు మరికొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి ఈనెల 3వ తేదీలోగా కౌంటర్లు సిద్ధం చేసి పిటిషనర్లకు అందించాలని 5న విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read