ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఓ వైపు భారీ దోపిడికి పాల్పడుతూ, మరో వైపు దళితుల భూములు లాక్కుంటోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ "హౌసింగ్ స్కీం కోసం ప్రభుత్వ, ప్రైవేటు భూమి కలిపి 38,853 ఎకరాలు సేకరిస్తున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం ఖర్చుపెడుతున్న రూ.7 వేల కోట్లలో సగానికి పైగా జగన్ తన అనుయాయులకు కట్టబెట్టేందుకు పథక రచన చేశారు. ఇందులో ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం సేకరించే భూముల కొనుగోళ్లలో వైసీపీ నాయకులు రూ.1600 కోట్లు దోచుకున్నారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల నుంచి కమీషన్ల రూపంలో రూ.1400 కోట్లు, ఇళ్ల స్థలాలకు పేదల నుంచి వసూలు చేసింది రూ.200 కోట్లు. మొత్తం రూ.1600 కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.690 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఒక్క పెనమలూరు నియోజకవర్గంలోనే రూ.183 కోట్ల కుంభకోణం జరిగిందంటే వైకాపా నాయకుల అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇళ్ల స్థలాల కోసం మార్కెట్ రేటు కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములన్నీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ స్థానిక నాయకులవే. వీరి నుంచి కొనుగోలు చేసి, వాటిని చదును చేసి, లే అవుట్ పనుల పేరుతో కూడా వందల కోట్ల చేతులు మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం రూ.5 లక్షలు విలువ చేయని భూములను రూ.45 లక్షల నుంచి రూ.70 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు దూరంగా ఉన్న చోట ఎకరా రూ.85 లక్షల నుంచి రూ. కోటి 5 లక్షలకు కొనుగోలు చేస్తూ వైకాపా నాయకులు భారీ అవినీతికి తెరలేపారు. గ్రామానికి దగ్గరైతే ఒకరేటు, దూరం అయితే మరో రేటు వసూలు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి కూడా స్థలానికి రూ.10వేల నుంచి రూ.60 వేలు వసూలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే చెబుతున్నారు. ప్రైవేటు భూములంటూ చెరువులు, శ్మశానాలు, కొండలు, పోరంబోకు స్థలాలు, ఇసుక దిబ్బలు, రాళ్ల గుట్టలను కూడా కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. రూ.2,398 కోట్ల ఉపాధి నిధులతో భూములను చదును చేసి ప్లాట్లుగా మార్చే క్రమంలోనూ భారీ అవినీతికి తెరలేపారు."

"కృష్ణా జిల్లాలో 2,621 ఎకరాల ప్రైవేటు భూమి సేకరించగా.. ఎకరా రూ.18 లక్షల నుంచి రూ.89 లక్షల వరకు చెల్లించారు. ఇందుకు రైతులకు రూ.1150 కోట్లు చెల్లించగా.. వైకాపా నాయకులు తమ బ్లాక్ మనీని వైట్ గా మార్చి, పన్ను ఎగవేసేందుకు రైతుల సొమ్ముపై కన్నేశారు. కోటి రూపాయలు తమ అకౌంట్లో వేస్తే.. అదనంగా రూ.10 లక్షలు ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ఎకరా రూ.45 లక్షలు ఉండగా.. రూ.75 లక్షలకు కొన్నారు. ఈ విధంగా 523 ఎకరాలను కొనుగోలు చేయగా ఇందులో రూ.183 కోట్ల అవినీతి జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన 100 ఎకరాల సొంత పొలాన్ని మార్కెట్ రేటు కంటే 3 రెట్లు అధికంగా ప్రభుత్వానికి అమ్మారు. ఎకరా రూ.18 లక్షల చొప్పున రూ.18 కోట్లు తన జేబులో వేసుకున్నారు. కాకినాడలో, మచిలీపట్నంలో తీర ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను కొట్టేసి భారీ అవినీతికి పాల్పడ్డారు. మడ అడవులను తొలగించి మెరక చేయడంలోనూ అవినీతికి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి, కాపవరంలో 586 ఎకరాలు ముంపు భూములు కొనుగోలు చేసి, రూ.400 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగపేట మండలంలో మొత్తం 86 ఎకరాల భూసేకరణ జరగ్గా రూ.23 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయింది. తమ ప్రభుత్వం కారణంగా ఎకరాకు మార్కెట్ ధర కంటే పది లక్షల లాభం వచ్చింది కాబట్టి ఎకరాకు రూ.4 లక్షలను వైకాపా నాయకులు వసూలు చేశారు. "

"మరోవైపు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతో వారి అసైన్డ్ భూములు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో హోంగార్డులు, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూడా బలవంతంగా లాక్కోవడం వైసీపీ దురాగతాలకు నిదర్శనం. విశాఖ చుట్టుపక్కల 6,116 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల, బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునేందుకు కుట్ర పన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోయిన వారిలో 90శాతం బడుగు, బలహీనవర్గాల ప్రజలే. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా రద్దుచేసి బలవంతంగా సేకరిస్తుండటం వైకాపా కక్ష సాధింపునకు నిదర్శనం. వైకాపా దుర్మార్గపు చర్యలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలచివేస్తోంది. తన 2 ఎకరాల డి-ఫారం బలవంతపు భూసేకరణ వల్ల తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బాలరాజు మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో తన రెండున్నర ఎకరాల భూమిని అధికారులు, వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకుని రాత్రికి రాత్రి లేఅవుట్లు వేయడంతో మదన్ మోహన్, తెలుగుభూలక్ష్మి దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవేవీ మీ ముఖ్యమంత్రి జగన్ కి పట్టవా?
" అని జవహర్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read