మూడు ముక్కల రాజధాని అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తరువాత, ప్రజలందరూ, ముందుగా కేంద్రం వైపు, తరువాత కోర్ట్ ల వైపు ఆశగా చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కల రాజధానితో, ఎవరికీ ఉపయోగం ఉండదని, ఇప్పటికే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తన నిర్ణయాన్ని ముందుకు తీసుకు వెళ్తూనే ఉన్నారు. 55 రోజులుగా అమరావతి ప్రజలు నిరనస చేస్తున్న లెక్క చెయ్యటం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు, మేము అమరావతిని మేము కాపాడతాం అంటూ బయలుదేరాయి. కాని ఏమైందో ఏమో కాని, మొదట్లో చూపించిన ఉత్సాహం, ఇప్పుడు కనిపించటం లేదు. బీజేపీ కాని, ఇటు జనసేన కాని, అసలు అమరావతి గురించే మాట్లాడటం లేదు. అయినా ఏపి ప్రజలు ఆశగా కేంద్రం వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి స్పీడుకు, కేంద్రం బ్రేకులు వేస్తుందని, ఆశగా చూస్తున్నారు కాని, కేంద్రం మాత్రం ఏ మాత్రం స్పందించటం లేదు.

ఈ క్రమంలోనే, ఈ రోజు పార్లమెంట్ లో, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఆడిగిన ప్రశ్నతో, మరోసారి, కేంద్రం వైఖరి స్పష్టం అయ్యింది. కేశినేని నాని మొత్తం నాలుగు ప్రశ్నలు అడిగారు. ఒక రాష్ట్రం, రాజధానిని ఎంపిక చెయ్యాలి అంటే, ఏదైనా ప్రక్రియ ఉందా ? ప్రక్రియ ఉంటే, వాటి వివరాలు చెప్పండి. గతంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో, తమ నూతన రాజధానులు ఎలా ఎంపిక చేసుకున్నాయి ? ప్రభుత్వానికి, ఈ విషయంలో ఏదైనా పాత్ర ఉంటుందా అని కేశినేని నాని ప్రశ్నించారు. అయితే దీని పై, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం చెప్తూ, రాష్ట్ర రాజధానులు ఎంపిక చేసుకునే అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

అంటే మాకు ఏ సంబంధం లేదు అని కేంద్రం చెప్పి, తప్పించుకుంది. వారం క్రితం, గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం ఇలాగే సమాధానం చెప్పింది. కాకపొతే అప్పుడు, అమరావతిని రాజధానిగా 2015లోనే నోటిఫై చేసారు అని ప్రకటన చేసింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్నకు మాత్రం కేంద్రం సమాధానం చెపాల్సి ఉంటుంది. కొత్త రాజధానులు అంశం అయితే రాష్ట్రాలు ఇష్టం అనుకోవచ్చు కానీ, ఇప్పటికే ఉన్న రాజధానిని మార్చటం కేంద్రం ఎలా సమర్ధిస్తుంది ? అది కూడా ఇప్పటికే 2500 కోట్లు కేంద్రం అమరావతికి ఇచ్చి, ఇప్పుడు అది నిరుపయోగంగా పడేస్తాం అని రాష్ట్రం అంటుంటే, కేంద్రం మాకు సంబంధం లేదు, అది రాష్ట్రం ఇష్టం అనటం ఎంత వరకు సమంజసం ? ఇదే సంస్కృతి అన్ని రాష్ట్రాలకు పాకితే, అధికారం మారిన ప్రతిసారి, ఇలా రాజధానులు మార్చితే, కేంద్రం చూస్తూ ఉంటుందా ?

Advertisements