నిన్నటి వరకు ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్, ఆయన ఏసీబీ డీజీగా ఉన్న చివరి రోజుల్లో చేసిన పనితో, అవినీతి పరులు వణికిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అందినకాడికి దోచుకున్నారు. ముందు మూడు తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిని పోగేశారు. కథ అడ్డం తిరగడంతో ఏసీబీకి చిక్కారు. ఆ ఏముందిలే.. ఏసీబీకి చిక్కినా మనం పోగేసిన ఆస్తికి డోకా లేదనే ధీమాతో ఉన్న అక్రమార్కుల వెన్నులో ఇప్పుడు కొత్త చట్టం వణుకుపుట్టిస్తోంది. గత నెల 11 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం.. అక్రమాస్తులన్నీ ప్రభుత్వ పరం కానున్నాయి. గతేడాది విశాఖపట్టణం రేంజ్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సర్వే ఇన్స్పెక్టర్ జీ.ఎల్.గణేశ్వరరావును కొత్త చట్టం కింద తొలికేసుగా తీసుకున్నారు. మరో మూడు అవినీతి తిమింగళాలను కొత్త చట్టం పరిధిలోకి తేనున్నట్టు ఏసీబీ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

rp thakur 01072018

కొత్త చట్టం పరిధిలోకి వెళ్లడం ఖాయమని తెలిసినప్పటికీ.. ఇప్పుడా ముగ్గురు ఎవరనే దానిపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది. 2017లో అక్రమాస్తుల కేసులు భారీగా నమోదయ్యాయి. ప్రజారోగ్య శాఖలో పని చేసిన పాము పాండురంగారావు, రాష్ట్రపట్టణ ప్రణాళిక డైరెక్టర్ జీ.రఘు, రహదార్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.గంగాధర్, రాష్ట్రపరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ సురేష్ బాబు సహా 11 భారీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పట్టుబడిన అక్రమ సంపాదన రూ.2500 నుంచి రూ.3వేల కోట్ల వరకు ఉండొచ్చని అప్పట్లోనే అధికారులు నిర్ధారించారు. రఘు, పాండు రంగారావు కేసుల్లోనే రూ.వెయ్యి కోట్ల వరకు అక్రమాస్తులను అధికారులు సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను ప్రత్యేక కోర్టు చట్టం-2016 పరిధిలోకి తెచ్చేందుకు ఏసీబీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

rp thakur 01072018

పోయిన నెల 11 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను నెల రోజుల్లోగా ప్రభుత్వపరం చేస్తారు. చరాస్తులను కోర్టు కస్టడీలో పెట్టి స్థిరాస్తుల పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయనున్నారు. ఆరు నెలల్లోగా కేసులో చార్జిషీటు దాఖలు చేయడంతో పాటు ఏడాది లోగా విచారణ పూర్తి చేస్తారు. విచారణలో కేసులో పట్టుబడిన అధికారి, ఉద్యోగికి శిక్ష పడితే స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వ పరమవుతాయి. ఒక వేళ శిక్ష పడకుంటే 5శాతం వడ్డీతో ప్రభుత్వం సంబంధితులకు ఆస్తులను అప్పగిస్తుంది. ఇప్పటి వరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించే అధికారం లేకున్నా అనుభవించే అధికారం మాత్రం వీరికి ఉండేది. పైగా చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టు విచారణకు ప్రభుత్వ అనుమతి కోరాల్సి వచ్చేది. కొత్త చట్టంలో ఇప్పుడా పరిస్థితి లేదు. దేశంలో ఇప్పటి వరకు బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా చట్టం అమలులో ఉంది. ఇప్పుడు ఏపీ ఈ తరహా చట్టం ప్రయోగించిన మూడో రాష్ట్రంగా ఉండబోతోంది.

Advertisements