తమను నమ్ముకున్న వాళ్ళకోసం తమకుటుంబం ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తమస్వగ్రామం నిమ్మాడలో దివంగత తెదేపా నేత అతని సోదరుడు కింజరాపు ఎర్రన్నాయుడు 63వ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎర్రన్న ఘాట్ వద్దకు చేరుకున్న అతని కుటుంబ సభ్యులు భార్య విజయకుమారి, తల్లి కళావతమ్మ, కుమారుడు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, సోదరులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కె. హరివరప్రసాద్, ఏసీపీ కె. ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ నారాయణమూర్తి, తదితరులు ఎర్రన్నఘాటకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్.. ఎర్రన్న.. అంటూ జోహార్లర్పించారు. అలాగే మెయిన్ రోడ్ లో ఉన్న ఎర్రన్న విగ్రహానికి సైతం అంతా కలిసి పూలమాలలు వేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే, ఎంపీలు ప్రారంభించారు.

achem 24022020 2

అనంతరం జరిగిన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం నాయకులపైన, కార్యకర్తల పైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పేదల పథకాలు నిలిపేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెడతానని ఎర్రన్న జయంతి సభ సాక్షిగా చెప్తున్నట్లు పేర్కొన్నారు. తనపైన ఉద్దేశ్యపూర్వకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను అవినీతికి పాల్పడనని అవసరమైతే ఇతరుల వద్ద డబ్బు అడిగి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. కష్టకాలంలో ఉన్న పార్టీని అన్ని విధాలా ఆదుకోవడంలో తాను ముందుంటానని, ఈ క్రమంలో ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. ప్రజాబలమే తనకు శ్రీరామరక్షని అన్నారు. ఇ ఎస్ ఐ స్కామ్ లో తాను తప్పు చేసా నని నిరూపించాలని, తమది తప్పు చేసే కుటుంబం కాదని, తమ వద్ద తప్పు లేకపోతే ఎవరినైనా అడుగుతామని, అంతే తప్పు చేసే కుటుంబం తమది కాదన్నారు

achem 24022020 3

ఎర్రన్నాయుడు సాక్షిగా తాను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం దిక్కు ఉన్నది చేసుకోవచ్చు నని ఆయన ఘాటుగా విమర్శించారు. తాము నిత్యం ప్రజలు వద్ద ఉంటూ ఎర్రన్న అడుగుజాడల్లో నడుస్తామ న్నారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందన్నారు. ప్రజలందరికీ నిష్పక్షపాత పాలన అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అన్నారు. తన తండ్రి ఎర్రన్న జయంతి సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో వారసత్వ రాజకీయాలు తగ్గిపోతున్న తరుణంలో తమ కుటుంబానికి వారసత్వ రాజకీయ నాయకులుగా ముగ్గురిని అందించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దీనికి ఎర్రన్నాయుడు ఆశీస్సులే కారణమన్నారు. చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా ఉన్న అచ్చెన్నాయుడంటే జగన్మోహన్ రెడ్డికి భయమని, అందుకే అతనిపై కక్షసాధింపు చేస్తున్నారన్నారు. రక్తదానంకు మించిన దానం లేదని, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisements