రాజధాని అమరావతికి వరుస షాకులు ఇస్తున్న ఏపి ప్రభుత్వం, ప్రజలు గత 270 రోజులుగా ఆందోళన చేస్తున్నా, పట్టించుకోక పోగా, వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నారు. రెండు రోజుల క్రితం, మంత్రి కొడాలి నాని, ఇక్కడ అమరావతిలో శాసన రాజధానిగా కూడా ఉండటానికి వీలు లేదు, నేను ఈ విషయం జగన్ కు చెప్పాను, ఆయన చర్చించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు అని చెప్పిన సంగతి తెలిసిందే. దీని పై అమరావతి రైతులు, మహిళలు ఆందోళన చెందుతూ ఉండగానే, ఇప్పుడు అమరావతి ప్రజలకు మరో షాక్ తగిలింది. అమరావతి ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఉన్న సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాలను, అక్కడ నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకువటంతో, అమరావతి వాసులు షాక్ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో గ్రామాలు అయిన నీరుకొండ, నవులూరు, నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక సహా మరి కొన్ని గ్రామాల నుంచి సిఆర్డీఏ కార్యాలయాలు తరలించారు. అక్కడ ఉన్న ఫైల్స్, ఫర్నిచర్ మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఉన్న సిఆర్డీఏ కార్యాలయంలో ఉన్న, రికార్డులు అన్నీ, తుళ్ళూరులో ఉన్న కార్యాలయానికి తరలించారు. అయితే దీని పై రాజధాని రైతులు ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మారో పక్క రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు, దళిత సంఘాల జేఏసీలు చేస్తున్న పోరాట దీక్షలకు వివిధ పక్షాల నుంచి మద్దతు లభిస్తుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు, దళిత జేఏసీలు 268 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతులు వాపోయారు. అమరావతిని రాజధానిగా ఆనాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన జగన్‌మోహన్‌రెడ్డి నేడు అధికారం చేపట్టిన తరువాత మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురి చేశారని ధ్వజమెత్తారు. మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని ఏమి మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో శాసన రాజధానిని కూడా లేకుండా చేయాలనే అనాలోచిత కలలు కంటున్న మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisements