రాజధానిలో పైప్‌లైన్ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకునే వాణిజ్య సంస్థల నుంచి యూజర్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చునని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ తదితర వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి వుంటుంది. నూతన నగరంలో అన్ని రకాల కేబుళ్లు, పైప్ లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాలి. ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జల మార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

amaravati 25042018

అమరావతిలో 1350 ఎకరాలలో నిర్మించే పరిపాలన నగరానికి ప్రత్యేకంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని గత సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు తాజాగా ఈ ప్రతిపాదనలను పరిశీలించారు. సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమీక్షా సమావేశంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అమరావతిలో పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తొలుత 10 ఎకరాలలో మాల్ తరహాలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ధియేటర్లు, రెస్టరెంట్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపింప్ సదుపాయాలతో ఈ మాల్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. మాల్ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ చేపడితే, తరువాత దాని నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించవచ్చునని తలపోస్తున్నారు.

amaravati 25042018

ఏడాదిన్నర కాలంలోగా ఇక్కడికి 38 వేల కుటుంబాలు తరలివస్తాయని అంచనా వేస్తున్నామని, మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీరందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా సదుపాయాలను ముందే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలో స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చినా ప్రస్తుత అవసరాలను గమనంలోకి తీసుకుని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. కంటైనర్ హోటల్ భావనను విజయవాడలోని మురళీ ఫార్య్చూన్ నిర్వాహకులు ఐటీసీతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు.

amaravati 25042018

కొత్త నగరంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అంచనావేశారు. అమరావతి ఆర్థిక ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. ఆదాయాన్ని పెంచడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మార్చాల్సివుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకునే క్రమంలో మున్ముందు ప్రభుత్వానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడ్చుకోకూడదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చునేప్పుడు ప్రభుత్వానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయేలా కాకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేలా విధానాలు ఉండాలని చెప్పారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్‌ఆర్ఐలను భాగస్వాముల్ని చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ‘హడ్కో’ కంటే ఇతర వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలకు వడ్డీ తక్కువగా ఉన్నందున రాజధానిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుకు వాటి ద్వారా ఆర్థిక సాయం తీసుకోవాలన్న ప్రతిపాదనపై చర్చించారు.

Advertisements