కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో వెళ్తున్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ఎలాగైనా చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నాలు ముమ్మరం చేసింది. నిమిషనిమిషానికి పరిణామాలు మారుతున్నవేళ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హుటాహుటిన బెంగళూరుకు పయనమయ్యారు. షా వెంట కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ కూడా బెంగళూరుకు వస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే సీఎం పదవిని కూడా జేడీఎస్‌కు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌కు కుమార‌స్వామి కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు, అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగారు.

amitshah 15052018 2

మ్యాజిక్‌ ఫిగర్‌ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో చీకలకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అవసరమైన వ్యూహరచనతోపాటు అమలును కూడా స్వయంగా పర్యవేక్షించేందుకే బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా బెంగళూరుకు వస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్‌ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారన్నది కీలకంగా మారింది.

amitshah 15052018 3

కాంగ్రెస్ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేస్తే.. బీజేపీ మాత్రం దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసింది. రేవణ్ణకు 12మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణ వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. అయితే పార్టీలో ఏర్పడిన ఈ చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు, అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్, అమిత్ షా నుంచి తన ఎమ్మల్యేలను కాపాడుకోవటానికి, క్యాంపు రాజకీయాలకు తెర లేపే అవకాసం ఉంది.

Advertisements