కొండలతో నిండిన బెజవాడ నగరంలో మరో సొరంగ మార్గం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ చిన్న నగరంలో ఎటు నుంచి ఎటు ప్రయాణించాలన్నా కొండల చుట్టూ తిరిగివెళ్లాల్సిందే. అత్యంత తక్కువ దూరం ఉన్న గుణదల - బెంజ్‌సర్కిల్‌ మధ్య ప్రయాణానికి సైతం పెరిగిన ట్రాఫిక్‌ కారణంగా గంటకు పైగా సమయం వెచ్చించాల్సివస్తోంది. రామవరప్పాడు నుంచి బస్టాండుకు వెళ్లాలన్నా అంతే. పాతబస్తీలో మాదిరి కొండల మధ్య మరో సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తే మరి కొన్ని ప్రాంతాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించవచ్చునని భావించిన వీఎంసీ ఆ దిశగా ప్రణాళికలను రచిస్తోంది. రూ.200 కోట్ల అంచనాలతో వీఎంసీ ఆహ్వానించిన ఆర్‌ఎఫ్‌పీలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన వస్తోంది.

sorangam 05082018 2

60వ దశకంలో కేఎల్‌ రావు జలవనరుల శాఖ మంత్రి(ఇండిపెండెంట్లీ ఇన్‌చార్జి)గా ఉన్న సమయంలో ఏర్పాటుచేసిన సొరంగ మార్గం నేటికీ లక్షలాదిమంది ప్రయాణికులకు ఉపయోగపడుతోంది. అదే తరహాలో నగరంలో కొండల మధ్య నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర సొరంగాన్ని ఏర్పాటుచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని కోసం జూన్‌ 6న ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానిస్తున్నట్టు వీఎంసీ ప్రకటించగా.. ఢిల్లీ నుంచి రెండు అంతర్జాతీయ సంస్థలు, కోల్‌కతా వంటి నగరాలతో పాటు స్వీడన్‌ వంటి ఇతర దేశాల నుంచి పలు అంతర్జాతీయ సంస్థలు డీపీఆర్‌లు సిద్ధం చేయడానికి పోటీ పడుతున్నాయి.

sorangam 05082018 3

ప్రస్తుత అంచనాల ప్రకారం గుణదల, క్రీస్తురాజపురం, మొగల్రాజపురం, లయోలా కళాశాల, 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాలు, పాదచారుల కోసం గుణదల కొండ కిందగా జాతీయ రహదారి వైపునకు గానీ మొగల్రాజపురం వైపునకు గానీ ఏర్పాటుచేయాలని వీఎంసీ భావిస్తోంది. లేకపోతే విద్యాధరపురం కొండకు ప్రస్తుత సొరంగ మార్గం కాకుండా మరో మార్గానికి సన్నాహాలు చేసే అవకాశముంది. విజయవాడలో నిర్మితమై ఉన్న 1264 కిలోమీటర్ల రోడ్లపై నిత్యం 250కి పైగా ప్రైవేటు బస్సులు (పర్మిట్‌ ఉన్నవి) హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్టణం వంటి ఇతర ప్రాంతాలకు నడుస్తుంటాయి. వాటితోపాటు 8లక్షల ద్విచక్ర వాహనాలు, 36వేల ఆటోలు, 50వేలకు పైగా కార్లు, 30వేలకు పైగా లారీలు నగరంలో ప్రయాణిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు లెక్కేలేదు.

Advertisements