కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ.. తాజా బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు ఏడుకు పెరిగినట్టు తెలిపింది. ఆస్పత్రి నుంచి ఓ బాధితుడు కోలుకున్నాడని.. డిశ్చార్జ్ చేశామని ప్రకటించింది. బులెటిన్ లో ఉన్న వివరాల ప్రకారం.. విశాఖ విమానాశ్రయం, పోర్టుల నుంచి వచ్చిన 12,082 మందికి అధికారులు స్క్రీనింగ్ పూర్తి చేశారు. అలాగే.. రాష్ట్రానికి 14,038 మంది విదేశీ ప్రయాణికులు వచ్చినట్టు గుర్తించారు. అందులో.. 2426 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో 11,526 మంది ఉన్నారు. 86 మందిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 220 మంది నమూనాలు పరీక్షలకు పంపించగా.. ఏడుగురికి పాజిటివ్‌, 168 మందికి నెగిటివ్‌గా తేలింది. మరో 45 మంది నమూనాల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లురు, చిత్తూరు జిల్లాల్లో మార్చి 31 వరకు 144 సెక్షన్‌ అమలవుతుందని తెలిపారు.

కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా అధికారులతో కలెక్టర్ వినయ్ చంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండేలా తీసుకోవలసిన చర్యలను కలెక్టర్ వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపేలా గ్రామ, పట్టణ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు అనకాపల్లి ఆర్డీఓ సీతారామారావు వివరించారు. కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

మరో పక్క,జనంలో భారీగా కనిపించిన జనతా కర్ఫ్యూ స్ఫూర్తి... లాక్‌డౌన్‌లో కరువైంది. ఆదివారం ఇంటి నుంచి కదలని పౌరులు కర్ఫ్యూ పూర్తైన అనంతరం రోడ్లపై కనిపించారు. సామాజిక దూరం పాటింపును పూర్తిగా పక్కన పెట్టేశారు. అత్యవసరాలో.. మరేదోగానీ రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ రద్దీ కనిపించింది. పోలీసులు జోక్యం చేసుకుని జనాన్ని నియంత్రించాక మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త మెరుగుపడింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను నియంత్రించారు. చాలామంది అవగాహన లేమితో సమస్య మరింత పెరిగింది. రైతుబజార్లు, దుకాణాల్లో కూరగాయలు, నిత్యావసరాల కోసం ఒకరిపై మరొకరు ఎగబడ్డారు. ఆటోలు, ట్యాక్సీల రాకపోకలపై ఆంక్షలు విధించినప్పటికీ... ఎవరూ పట్టించుకోలేదు.

Advertisements