ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఏపీలో అందిన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని స్పష్టం చేసింది. నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలు టాప్ లో ఉన్నాయని తెలిపింది. ఓట్లను తొలగించాల్సిందిగా 9.5 లక్షల దరఖాస్తులు అందగా...1.41 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని ఈసీ పేర్కొంది. జనవరి 11వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత 1,41,822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో 3.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి తుదిజాబితాలో ఓటర్ల సంఖ్య 3.93 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. త్వరలోనే తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. కొత్తగా 21,16,747 మందిని చేర్చినట్లు ప్రకటించింది.

ec 23032019

జిల్లాలవారీగా నకిలీ ఓట్లను ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. శ్రీకాకుళం- 2,579, విజయనగరం- 5,166, విశాఖ- 2,407, పశ్చిమగోదావరి 8,669, ప్రకాశం- 6,040, నెల్లూరు- 3,850, కడప- 5,292, కర్నూలు- 7,684, అనంతపురం- 6,516, గుంటూరు- 35,063, తూ.గో- 24,190, కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052 నకిలీ ఓట్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఏపీలో గత రెండున్నర నెలల వ్యవధిలో లక్షా 41వేల 822 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. తొలగించిన ఓట్లలో 68,422 మృతి చెందిన వారివి, 64,083 ఓట్లు డబుల్‌ ఓట్లు ఉన్నవారివి, 8,698 ఓట్లు వలసవెళ్లిన వారివి, 480 ఓట్లు తప్పిపోయిన వారివి, 139 ఓట్లు ఇతర కారణాలతో తొలగించినవి ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్లు 10 లోపునే ఉన్నాయి.

ec 23032019

ఈ సందర్భంగా జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయని పేర్కొంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కృష్ణా జిల్లా నందిగామలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4,746 ఓట్లు తొలగించారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని 4425 ఓట్లు తొలగించారు. మాచర్ల, పెద్దాపురం, పామర్రు, ప్రత్తిపాడు, రంపచోడవరం, సత్తెనపల్లె, చిలకలూరి పేట, కర్నూలు, రాజాంపేట, వినుకొండ, పాణ్యం, పలమనేరు తదితర నియోజకవర్గాల నుంచి ఒక్కో చోట రెండువేల ఓట్లు కంటే ఎక్కువ తొలగించారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఒక్క ఓటు కూడా తొలగించకపోగా విశాఖపట్నం ఉత్తరం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల నుంచి ఒకే ఒక్క ఓటు చొప్పున తొలగించారు. ప్రత్యేక సమగ్ర విచారణ జాబితాను ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 11న ప్రచురించింది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి ఓట్ల తొలగింపు కోసం దాదాపు 9.50 లక్షల ఫారం-7 దరఖాస్తులు అందాయి.

Advertisements