ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నం మారింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ కలర్, నీలం, నలుపు తెలుపు రంగుల్లో చిహ్నాన్ని ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి...అమరావతి శిల్ప కళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నంలో ఇప్పటి వరకు ‘పూర్ణ కుంభం’ ఉండేది. అయితే, అది తప్పని ప్రభుత్వం తేల్చింది. ఎన్నో ఏళ్ళుగా అధికారులు, ప్రభుత్వాలు ఈ తప్పు చేస్తున్నాయని తెలుసుకుని, ఇప్పుడు సరిదిద్దారు. దీనిలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క (ధర్మ చక్రం) ఉంటుంది.

క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్న ఘటం (పూర్ణఘటం) చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘటం చుట్టూ ఉన్న మూడు వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది. చిహ్నం పైభాగంలో ‘ఆంధ్రప్రదేశ్’ అని, కింది భాగంలో ‘సత్యమేవ జయతే’ అని తెలుగులో రాసి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఇవి ఆంగ్లంలో రాసి ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం మధ్యలో ‘పూర్ణ కుంభం’ ఉండేది. కానీ ధాన్య కటక మహాచైత్యంలో ఉన్నది పూర్ణఘటమే తప్ప, పూర్ణ కుంభం కాదని...ఆ మేరకు అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది.

ప్రముఖ స్థపతి, పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి తదితరులతో ఒక కమిటీని నియమించింది. వారి సూచనల మేరకు తగిన మార్పులతో అధికారిక చిహ్నాన్ని ఖరారు చేసింది. అధికారిక చిహ్నాన్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదన్న విషయంలోను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 1954నాటి నోటిఫికేషన్ ప్రకారం, అమరావతి సంస్కృతి నుంచి స్వీకరించిన పూర్ణఘటాన్ని తిరిగి అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించారు. దీని ప్రకారం... ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణ ఘటం చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. అదే సమయంలో గతంలో అధికార చిహ్నం పైభాగాన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఆంగ్లంలో ఉండేది. ఇప్పుడు దాన్ని తెలుగులోకి మార్చారు. ఆంగ్లంలో కిందివైపు ముద్రించారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని కూడా తెలుగులోకి మార్చి ముద్రించారు.

