ఎన్నో ఏళ్లుగా తన పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్న మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇటీవల చీకటి జీవోలను తీసుకువచ్చి దొడ్డిదారిన చైర్మను నియమించారని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ మాజీ చైర్మన్ పూసపాటి అశోకగజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలోని తన బంగ్లాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా నడుస్తున్న విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి, ఆస్తులను కబ్బా చేసేందుకు పన్నుతున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమన్నారు. మాన్సాస్ ట్రస్టు కింద దేశవ్యాప్తంగా 105 ఆలయాలు ఉండగా ప్రస్తుత చైర్మన్ సంచితా తన తండ్రి ఆనంద గజపతిరాజుతో విడిపోయిన 21 ఏళ్లలో ఏ ఒక్క ఆలయం తరుపున పండుగలకు హాజరుకాలేదన్నారు.

తండ్రి బతికి ఉన్నంత వరకూ చూడటానికి రాని వ్యక్తి చనిపోయిన తరువాత వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిన సంచిత ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకుని మాన్సాస్ చైర్మన్ ఎలా అయ్యారో ఆమె విజ్ఞతకే విడిచిపెట్టామన్నారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి కోర్టుకు వెళ్లామని, తమకు ఫేవర్‌గా తీర్పు వచ్చి మళ్లీ తానే మాన్సాస్ చైర్మన్ అవ్వొచ్చునని చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని ప్రతిపక్ష నాయకులు, చైర్మనను కోరుతున్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వాడే పదజాలం సోషల్ మీడియాలో విన్నానని, అసహ్యంగా ఉన్న ఆ పదజాలాన్ని తాము మాట్లాడలే మన్నారు. కార్యక్రమంలో టీడీపీ విజయనగరం ఇన్ చార్జి పూసపాటి అదితీ గజపతిరాజు పాల్గొన్నారు.

Advertisements