కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన 3వ్యవసాయ బిల్లులపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలి. 1) వ్యవసాయ మార్కెట్ బిల్లు (రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక సులభతర బిల్లు), 2)కాంటాక్ట్ ఫార్మింగ్ బిల్లు (రైతు సాధికారాత, రక్షణ ధర హామీసేవల ఒప్పంద బిల్లు), 3)అత్యవసర సరుకుల బిల్లు(నిత్యావసర సరుకుల సవరణ బిల్లు)లపై దేశవ్యాప్తంగా రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలి. ఈ 3బిల్లులపై అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రప్రభుత్వాలు, వివిధ ప్రాంతాల రైతు సంఘాలు, రైతు ప్రతినిధులతో విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ (డిబేట్) జరపాలి. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రైతాంగానికి మేలైన విధానాలను తీసుకురావాలి. సగటు భారతీయ రైతు అక్షరాస్యత, అవగాహనలతో పాటుగా సామాజికంగా స్థానిక రైతు నిస్సహాయతను కూడా పరిగణలోకి తీసుకుని చట్టాలను రూపొందించడం మనందరి బాధ్యత. బిల్లులను హడావుడిగా ప్రవేశపెట్టి, తొందరపడి నిర్ణయాలు తీసుకునేకన్నా సమగ్ర చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధనే సర్వత్రా మేలు. లేనిపక్షంలో ఇప్పటికే అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతన్నలపై మరింత భారం మోపే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర పొందడం అనేది ఒక విధాన నిర్ణయంగానే కాకుండా రైతుకు చట్టబద్దమైన హక్కుగా ఉండాలి. ఎంఎస్ పి పొందడం అనేది కొందరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండరాదు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలి. రైతు నిస్సహాయతను తమ లాభాల కోసం వాడుకునే వ్యవస్థలను, వ్యక్తులను ప్రోత్సహించరాదు.

ఆత్మవిశ్వాసం భారతీయ రైతన్నల ఆత్మగౌరవం. తమ కృషిపై, ప్రకృతిపై, ప్రభుత్వంపై మన రైతన్నల్లో తొణికిసలాడే విశ్వాసాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత. వారి స్వతంత్రతను, మనో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడటం పాలకుల ధర్మం. రైతాంగ ప్రయోజన విధానాలతోనే వారి విశ్వాసాన్ని ఇనుమడింప చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. 73ఏళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో రైతుల మేళ్ల కోసం వివిధ ప్రభుత్వాలు అనేక విధానాలు చేపట్టినా, వివిధ నిర్ణయాలు తీసుకున్నప్పటికి మన రైతులు, రైతుకూలీలు, వ్యవసాయ కార్మికుల ఆర్ధిక సామాజిక పురోగతి ఆశించిన స్థాయికి చేరకపోవడాన్ని ప్రభుత్వాలు గమనంలోకి తీసుకోవాలి. రైతులకు కావాల్సిన ఇన్ పుట్స్ అందుబాటులో ఉంచడంలో, వ్యవసాయ రుణాలు పొందడంలో, ఎంఎస్ పి పొందడంలో, విపత్తులలో నష్టపరిహారం పొందడంలో పకడ్బందీ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. లోక్ సభలో చర్చ సందర్భంగా వీటన్నింటిపై 3గురు ఎంపిలతోనే టిడిపి గళం బలంగా వినిపించినప్పటికీ, 22మంది ఎంపిలు ఉండి వైసిపి నోరు తెరవక పోవడం రైతుద్రోహం. టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు మద్దతుధరకు అదనంగా బోనస్ కూడా చెల్లించి కొనుగోళ్లు చేశాం. కానీ ప్రస్తుతం వైసిపి పాలనలో రైతులకు బోనస్ లేకపోగా మద్దతు ధరే లభించక రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం.

పంట కొనుగోళ్ల ధరల హెచ్చుతగ్గులపై ఎప్పటికప్పుడు తనిఖీలు, సమతుల్యతలు (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) ప్రభుత్వానికి ఉండాలి. దళారుల ఇష్టారాజ్యానికి పంట కొనుగోళ్లను వదిలేయరాదు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య సరైన వేదికగా మార్కెట్ యార్డులను పటిష్టం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగరాదు. తమ ఉత్పత్తులకు సరైన ధర ఏమిటో ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసే అనుసందాన వేదికలుగా మార్కెట్ యార్డులను పటిష్టం చేయాలి. రైతు ప్రయోజన కేంద్రాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డులను మరింత పటిష్టపర్చే చర్యలు చేపట్టాలి. రైతు లాభాలతో పాటుగా వినియోగదారుల ప్రయోజనాలను కూడా పరిరక్షించాలి. బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాల ధరల నియంత్రణా వ్యవస్థను పటిష్టం చేయాలి. రైతు బజార్ల వ్యవస్థను ఆధునీకరణ చేయడం ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉభయ తారకం అవుతుంది. పంట ఉత్పత్తుల నిల్వపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తే బ్లాక్ మార్కెట్ విక్రయాలకు దారితీస్తుంది, దళారుల బెడద పెరిగిపోతుంది. వీటన్నింటి దృష్ట్యా దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్ విక్రయాలకు, దళారుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసే వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటిల వ్యవస్థను, రైతు బజార్ల వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలేతప్ప ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రైతు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర దక్కాలి, పంటల కొనుగోళ్ళకు ప్రభుత్వ పరంగా పకడ్బందీ యంత్రాంగం ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే.. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. (నారా చంద్రబాబు నాయుడు)

Advertisements