ఈ రోజు పార్టీ నేతల టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గున్నారు. గురువారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరులో రోడ్డు షో లో పాల్గొంటానని తెలిపారు. టీడీపీని గెలిపిస్తే ప్రజలకు అండగా వుంటుందని తెలిపారు. మద్యం సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి టీడీపీ వారిపైనే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరని, ఇలాంటి వాటి పట్ల నాయకులు జాగ్రత్త పడాలని అన్నారు. గతంలో తెనాలిలో ఇదే తరహా అరాచకానికి పాల్పడ్డారని అన్నారు. కష్టపడి పనిచేస్తే అనుకున్న ఫలితాలు తప్పకుండా వస్తాయని, సమస్యలు వస్తే వెంటనే అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు ఇవ్వాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులను కిడ్నాప్ చేసి బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ చేయలేరన్నారు. అందరూ ధైర్యంగా పోరాడాలని కోరారు. అన్యాయం జరిగితే అందుబాటులో న్యాయవాదులుంటారని, ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆధారాలు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. న్యాయబద్ధంగా పోరాడితే తప్పు చేయడానికి అధికారులు కూడా భయపడతారన్నారు. అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తూ ఏ నేరం చేసినా తప్పించుకోలేరని వివరించారు.

cbn teleconf 02032021 2

మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి బెదిరించినా అధికారులు తప్పు చేయకుండా వుండే పరిస్థితి రావాలన్నారు. కష్టకాలంలో పోరాడితేనే గుర్తింపు వుంటుందని, కలిసి కట్టుగా పోరాడితే విజయం వరిస్తుందని వివరించారు. వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య అని, ఇబ్బందులుంటే అన్ని విధాలా అండగా టీడీపీ వుంటుందని భరోసా ఇచ్చారు. అందరూ ధైర్యంగా పోరాడాలని, ఏదైనా ఘటన జరిగితే తాను కూడా వచ్చి పోరాడతానన్నారు. వాలంటీర్లకు భయపడాల్సిన అవసరం లేదని, ఎస్ఈసీ కూడా వారి నుండి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిందని అన్నారు. న్యాయంగా పోరాడదామని, ఇప్పుడు పోరాటం చేస్తే భవిష్యత్తులోనూ అధికారులు సక్రమంగా పనిచేసే అవకాశం వుంటుందన్నారు. నాయకులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. నాయకుడు ప్రజల్లో నమ్మకం కలిగించాలని అన్నారు. ప్రతి ఇళ్లూ తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడతారని తెలిపారు.

Advertisements