ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో ప్రజల మధ్య భోగి వేడుకులు జరుపుకున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు, ఇప్పటికీ ధాన్యం డబ్బులు ప్రభుత్వం జమ చేయకపోవటం, రైతులకు చేస్తున్న అనేక మోసాలకు వ్యతిరేకంగా, ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక జీవోలను చంద్రబాబు భోగి మంటల్లో వేసి తగలుబెట్టారు. ఉదయం 5 గంటలకే చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గున్నారు. తరువాత ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్బంగా చంద్రబాబు కొంత భావోద్వేగానికి గురయ్యారు. "నాకంటే గొప్పగా చేస్తాడని, ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అన్నాడని, పూనకం వచ్చినట్టు అతనికి ఓట్లు వేసి, ఇబ్బందులు పడుతున్నారు. నేనేమి తప్పు చేసానో, ఎందుకు ఓడిపోయానో ఇప్పటికీ తెలియటం లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేయాలని అనుక్షణం తపించాను. అదే నేను చేసిన తప్పు అయితే, క్షమించండి" అంటూ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తాను ప్రజలు జీవితాలు మారాలని, అనుక్షణం అనుకుని పని చేసి, అన్నీ చేసి పెడుతూ వెళ్లానని, నేను చేసిన తప్పు అదేనేమో అని చంద్రబాబు అన్నారు.

Advertisements