నేటి నుంచి దేశమంతా లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇల్లు విడిచి బయటకు రావటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. జనతా కర్ఫ్యూను మించి లాక్​డౌన్​ను అమలు చేస్తామని స్పష్టం చేశారు.21 రోజుల పాటు ఈ లాక్​డౌన్​ కొనసాగుతుందని తెలిపారు ప్రధాని. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారని.. అందువల్ల రానున్న 21 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు.లక్ష్మణ రేఖ..ప్రతి ఇంటికీ లాక్​డౌన్​ నిర్ణయం లక్ష్మణ రేఖ వంటిదని మోదీ అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. రహదారులపై ఎవరూ తిరగవద్దన్నారు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజులు పడుతుందని.. అందువల్ల తెలియకుండానే అతని నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రధాని మాట్లాడుతూ, "ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదు. ఈ దేశంలో ఏం జరిగినా ఇళ్లలోనే ఉండాలి. ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలి. ఏం జరిగినా ఇంటిచుట్టూ ఉన్న లక్ష్మణరేఖ దాటి రావొద్దు. కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాల్సిన సమయమిది. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ లాక్‌డౌన్ నిర్ణయం.. ప్రతి ఇంటికి లక్ష్మణరేఖ. కరోనా సోకినవాళ్లు తొలుత సాధారణంగానే ఉంటారు, కాబట్టి ఇతరులను కలిసే ప్రయత్నం చేయవద్దు. రహదారులపై ఎవరూ తిరగవద్దు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్నిరోజుల సమయం పడుతుంది."

"దానివల్ల తెలియకుండానే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం. వైరస్ సోకిన వ్యక్తి వందలమందికి వ్యాపింపజేయగలడని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరేందుకు 67 రోజులు పట్టింది. తర్వాత 11 రోజుల్లోనే మరో లక్ష మంది బాధితులు నమోదయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో లక్ష మందికి సోకేందుకు 4 రోజులే పడుతుంది. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందో చెప్పేందుకు ఈ గణాంకాలే ఉదాహరణ. చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్‌ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వైద్య సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయింపు. ఆరోగ్య సేవలకే తొలి ప్రధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నా. సంక్షోభ సమయంలో భుజం భుజం కలిపి పనిచేయాలి. కేంద్ర, రాష్ట్రాలు నిరంతరం ఇదే విషయంపై ఆలోచిస్తున్నాయి. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. కేంద్ర, రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులు పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. నిర్లక్ష్య ధోరణితో మందులు తీసుకుంటే మరింత ప్రమాదంలో పడతారు. 21 రోజుల లాక్‌డౌన్‌.. మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు "

Advertisements