గుంటూరులో అంబేద్కర్ జయంతి వేడుకలను, బాబా సాహెబ్ అంబేద్కర్ నీలి జెండాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీపై ఎగుర వేసేందుకు బహుజనులంతా ఐక్యంగా ముందుకు నడుస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ కల సాకారం కాబోతుందని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్ జై భీమ్ యాక్సెస్ జస్టిస్ కార్యాలయంలో అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని లక్షమందితో చారిత్రాత్మక బహిరంగ సభ "జైభీమ్ సమరభేరి” గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రజలకు రాజ్యాంగాన్ని రచించి హక్కులు ఇస్తే వాటిని నేటి పాలకులు కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశ యాలను ముందుకు తీసు కెళ్లేందుకు జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఉద్యమిస్తుందని తెలిపారు.  అదేవిధంగా అంబేద్కర్ వాదులంతా 14న గుంటూరులో మార్కెట్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తమకు పర్మిషన్ ఇవ్వలేదని, ఒక వేళ అంబేద్కర్ జయంతి వేడుకలను అడ్డుకుంటే జాతి మొత్తం తిరగబడుతుంద ని,ప్రభుత్వాలకు ప్రజలు ఎదురు తిరిగితే వారికే ముప్పు అని ఆగ్రహం వ్యకం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఎపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ జై భీమ్ సమరభేరీని ప్రతీ సామాజిక కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ జయంతి రోజున ఆంద్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ప్రకటన కోసం జైభీమ్ " సమర భేరీ సభ జరుగుతుందన్నారు. ఏపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుగా ఉన్న బహుజ నులు అంతా రాజకీయంగా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

Advertisements