కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 186దేశాలు వణికిపోతుంటే, బాధ్యతాయు తమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మాత్రం, ప్రజలగురించి పట్టించుకోకుండా తాడేపల్లి నివాసంలో పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఊరంతా ఒకదారయితే, ఉలిపికట్టెది ఒకదార న్నట్టుగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి, జాతీయవిపత్తు సంభవించినా ప్రజలముందుకు రావడం లేదన్నారు. పక్కరాష్ట్రంలో జనతాకర్ఫ్యూ 24 గంటలు పాటించాలని నిర్ణయం తీసుకున్నారని, మనరాష్ట్రంలో మాత్రం అసలు ప్రభుత్వముందా అన్న ఆలోచన ప్రజలందరి కీ కలుగుతోందన్నారు. ప్రభుత్వం విడుదలచేసిన హెల్త్ బులెటిన్ కూడా చాలా బాధ్యతారాహిత్యంగా ఉందన్న దేవినేని, 28రోజుల పరిశీలన అనంతరం 259 మందిని ఇళ్లకు పంపినట్లు పేర్కొన్నారని, దాన్నిబట్టిచూస్తే, కరోనా వ్యాప్తి గురించి తెలిసికూడా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికే సిద్ధమైందన్నారు. 28రోజులుగా పరిశీలన జరుపుతుంటే, ప్రభుత్వం ప్రజలకు ఎందుకుచెప్పలేదన్నారు. సర్కారుకి ప్రజల ఆరోగ్యం ముఖ్యమో.. స్థానిక ఎన్నికలు ముఖ్యమో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో కేసువేసి, ఎన్నికలు జరిపిపంచుకోవడానికే ప్రభుత్వం ఈ వాస్తవాలను తొక్కిపెట్టిందన్నారు. 711మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం వారంతా ఎక్కడున్నారో.. వారి ఆరోగ్య పరిస్థితిఏమిటో ఎందుకు వెల్లడించడంలేదని దేవినేని ప్రశ్నించారు.

దేశవిదేశాలనుంచి పక్క రాష్ట్రానికి 20వేలమంది వస్తే, మనరాష్ట్రానికి 12వేలమంది వచ్చారని, వారందరి ఆరోగ్య పరిస్థితి ఏమిటో, వారిలో ఎందరిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారో.. అసలు రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రుల్లో అలాంటివార్డులు ఏర్పాటుచేశారో ఎందుకు వెల్లడించడంలేదన్నారు. తాడేపల్లి రాజప్రసాదం చుట్టుపక్కల కూడా బయటిదేశాల వారున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ 23వతేదీన రాజ్యసభఅభ్యర్థులకు ఓటేసేవిధానం నేర్పడంకోసం మాక్ పోలింగ్ నిర్వహించాలని చూస్తోందన్నారు. ఒక్కో ఎమ్మెల్యేతోపాటు 100నుంచి 200మంది వచ్చినా వేలమంది సెక్రటేరియట్, మంత్రులపేషీల్లో ఒకేచోట గుమికూడతారని, కరోనా వ్యాప్తి ఉధృతమవు తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాక్ పోలింగ్ నిర్వహణ పేరుతో వేలమందిని ఒకేచోట పోగుచేయడం ఏంటని ఉమా నిలదీశారు. హెల్త్ బులెటిన్ లో 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారని, వారంత ఎక్కడున్నారో.. వారి ఆరోగ్యపరిస్థితేమిటో ఎందుకు చెప్పడంలేదన్నారు? రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి రోజుకు ఒక్కసారైనా ప్రజల ముందుకు ఎందుకురావడంలేదని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఆపని ఎందుకు చేయడంలేదన్నారు. 10నెలల తరువాత ప్రజల ముందుకొచ్చి, కరోనా పెద్దజబ్బేకాదని, దానికి పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ చాలని ముఖ్యమంత్రి చెబితే, బాధ్యతాయుతమైన రాజ్యాంగపదవిలో ఉన్న తమ్మినేని సీతారామ్ కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, పారాసిట్మాల్ వేసుకుంటే 36గంటల్లో అది తగ్గిపోతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు.

వీరంతా ఇలామాట్లాడితే, ముఖ్యమంత్రి ముఖ్య కార్యాలయ అధికారి, ప్రతిఒక్కరూ రోజుకు రెండున్నర కిలోల పారాసిట్మాల్ వేసుకోమని చెప్పాడన్నారు. వీరంతా కూడా తామే డాక్టర్లమన్నట్లుగా ఇష్టానుసారం మాట్లాడు తున్నారని, వారికి ప్రజల ఆరోగ్యంపట్ల ఎంతబాధ్యత వారిమాటల్లోనే అర్థమవు తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షనాయకుడు కరోనాపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారని, కరపత్రాలద్వారా పలుసూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు, ప్రజలం తా తగినజాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని నమ్ముకొని వైరస్ బారిన పడవద్దని చెప్పడం జరిగిందన్నారు. (చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి చేసిన సూచనల వీడియోను ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు) బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి తనకేమిపట్టనట్టుగా తాడేపల్లిలో ముసుగేసుకొని పడుకుంటే, ప్రతిపక్షనేత మాత్రం ప్రజారోగ్యంపై తీవ్రమైన ఆందోళనతో ఉన్నాడన్నారు. జగన్ కు పబ్జీ ముఖ్యమో.. ప్రజల ప్రాణాలు ముఖ్యమో ఆయనే చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ నడుస్తుంటే, రాష్ట్రప్రభుత్వానికి ఎన్నికలే ఎమర్జన్సీ అయ్యాయన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకూడా ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడకుండా,రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిన లేఖ, దానిలోని వివరాలను తప్పుపట్టడానికే పరిమితమ య్యాడన్నారు.

ఎస్ఈసీపై ఆరోపణలుచేస్తూ, ఆయన లేఖలోని సమాచారం పత్రికా విలేకరులకు ఎలా వచ్చింది...వారిపై ఏం చర్యలు తీసుకోవాలి.. మాజీమంత్రికి ఈ కేసుని ఎలా ఆపాదించాలి అనే దానిగురించే బుగ్గన మాట్లాడాడన్నారు. ఏ2 విజయసాయిరెడ్డి కూడా బుద్ధి, జ్ఞానం లేకుండా ఎస్ఈసీ లేఖ ఎలా బయటకు వచ్చింది... స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సంగతి చూస్తాం.. వాళ్లపై చర్యలు తీసుకుంటాం.. వీళ్ల సంగతి చూస్తామంటూ ట్విట్టర్ లో చెపుతున్నాడన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి మంత్రులు, ముఖ్యమంత్రి, విజయసాయి దుర్మార్గంగా మాట్లాడటం, సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక కూడా దానిపై ఆరోపణలుచేయడం ఎంతవరకు సబబో వారే చెప్పాలన్నారు. ఎన్నికలు వాయిదా పడ్డాయని వైసీపీవారు గింజుకుంటున్నారు తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడలేదన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకొని, వేసిన వారిపై దాడిచేసి ఏకగ్రీవాలకు పాల్పడ్డారని, సిగ్గులేకుండా చేసిన పనులను సమర్థించుకుంటున్నాడన్నారు. డిఫ్యాక్టో హోంమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, డీజీపీ కార్యాలయంలో సాక్షిసిబ్బందిని ఉంచి, పర్యవేక్షణ చేయిస్తున్నాడన్నారు. వినుకొండ నియోజకవర్గమైన శావల్యాపురంలో ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన పారా రామారావు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కృష్ణాజిల్లా గంపలగూడెంలో కూడా ఎంపీటీసీస్థానానికి నామినేషన్ వేసిన అభ్యర్థికి చెందిన గడ్డివాము ను తగలబెట్టారన్నారు. కరోనా ప్రభావం వల్లప్రజలంతా భయపడుతుంటే, ముఖ్యమంత్రి, మంత్రులు, తమచర్యలను సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు.

ఎన్నికలు వాయిదాపడకుండా జరిగుంటే, నేడు 3కోట్ల మంది ఓటేయడానికి క్యూలైన్ లో ఉండేవారని, ఇది ఊహించుకుంటేనే పరిస్థితి ఎంతదారుణంగా ఉండేదో అర్థమవుతోందన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదావేస్తే, ఆయనకు కులాలు ఆపాదించి దూషించారని, ఇప్పుడేమో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ ని లక్ష్యంగా ఎంచుకొని వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగవ్యవస్థలను ఎలా కుళ్లబొడుస్తున్నాడో ప్రజలంతా గ్రహించాలన్నారు. తన అసహనం, అసమర్థత, చేతగాని తనం వల్లే ముఖ్యమంత్రి కులాల ప్రస్తావన తెస్తున్నాడ న్నారు. ఏమాత్రం సిగ్గులేకుండా, బాధ్యతలేకుండా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి బుగ్గన, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. 95రోజులుగా అమరావతి కోసం ఆందోళనలు జరగుతున్నా, ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటివరకు హైకోర్టు నుంచి 45 మొట్టికాయలు పడ్డాయని, జీవోనెం13ని కూడా కోర్టు తప్పుపట్టిందన్నా రు. ముఖ్యమంత్రి నోటినుంచి ఇప్పటివరకు ప్రజారాజధాని అమరావతి పేరే రాలేదని, ప్రజల ఆకాంక్షలు, ఆందోళనలపై ఆయనకు ఎంతచిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ప్రజలంతా ఎవరికి వారే స్వీయనియంత్రణ చర్యలు పాటించాలని, వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేవినేని సూచించారు.

Advertisements