ఉగాదినాటికి 25 లక్షల ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ఆత్రంలో, పేదల ఇళ్లను పీకి పందిరేసే కార్యక్రమాన్ని జగన్ నిరాటంకంగా సాగిస్తున్నాడని, రాష్ట్రవ్యాప్తంగా తరతరాలనుంచీ పేదలహక్కుభుక్తంలో ఉన్న 4వేల ఎకరాలను ఇంటిస్థలాల పేరుతో జగన్ ప్రభుత్వ కాజేసిందని టీడీపీసీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు సాగుచేసుకుంటున్న 350 ఎకరాలను ఇప్పటికే కాజేశారని, నందిగామ నియోజకవర్గంలోని ఐతవరంలో రూ.64లక్షల విలువచేసే భూమిని, ఇళ్లస్థలాలపేరుతో రూ.32 లక్షలకే కొట్టేయడానికి స్థానికంగా ఉండే వైసీపీ నేత దళారీగా మారాడన్నారు. అధికారుల అండతో, రైతులను, మహిళలను దళారులుగా చిత్రీకరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కునే తంతుని జగన్ ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తోందన్నారు. ఉగాదినాటికి 25లక్షల ఇళ్లస్థలాలు ఇచ్చాననే కీర్తికోసం, గ్రామాల్లో కంటికి కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ కబ్జా చేసేక్రతువుని జగన్ ప్రభుత్వం నిర్విఘ్నంగా సాగిస్తోందని దేవినేని మండిపడ్డారు. చెరువులు, పోరంబోకు, అసైన్డ్ భూములు, పాఠశాలల స్థలాలు, శ్మశానాలు, దేవాదాయ, అటవీభూములు సహా వేటినీ వదలడం లేదన్నారు. విశాఖపట్నంలో చంద్రబాబునే అరెస్ట్ చేశాం...మీరెంత అంటూ సామాన్యులను వైసీపీనేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.

తాము అడిగినరేటుకే భూమి అమ్మాలంటూ, పెట్టమన్నచోట సంతకం పెట్టాలంటూ భూములు గుంజుకుంటున్నారని దేవినేని తెలిపారు. 70 గదుల ఇంటిలో, రాజప్రాసాదాల్లో నివాసముండే జగన్మోహన్ రెడ్డి, పేదలకు మాత్రం సెంటు భూమి చాలని చెప్పడం సిగ్గుచేట్టన్నారు. జగన్ ప్రభుత్వం సెంటుప్రభుత్వమని ఎద్దేవాచేసిన దేవినేని, పేదలకిచ్చే సెంటుభూమిలో రాజప్రాసాదాలు ఎలాకట్టాలో చెప్పాలన్నారు. టీడీపీ హయాంలో ఇళ్లస్థలాలకు పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో రెండున్నరసెంట్లవరకు ఇవ్వడం జరిగిందన్నారు. జగన్ చేస్తున్నపనులేమిటో ఆయనకే తెలియడంలేదని, లక్షల, లక్షల జీతాలు తీసుకుంటున్న ఆయన సలహాదారులు ఏం చేస్తున్నారని ఉమా మండిపడ్డారు. జక్కంపూడిలో టీడీపీప్రభుత్వం నిర్మించిన 8,500ఇళ్లు నివాసముండటానికి సిద్ధంగా ఉన్నాయని, వాటికి సున్నమేసి పేదలకు ఇవ్వడానికి జగన్ కు మనసు రావడంలేదన్నారు. నెల్లూరు, తిరుపతి, విశాఖ వంటి ప్రాంతాల్లో కూడాపేదలకోసం ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. అవన్నీ లబ్దిదారులకు అప్పగిస్తే, వారంతా చంద్రబాబు పేరే చెబుతారన్న, అసూయతోనే జగన్ వాటిని గాలికొదిలేశాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల53వేల173 ఇళ్లను టీడీపీప్రభుత్వం పూర్తిచేసిందని, 6లక్షల15వేల638 వరకు పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నాయని, జగన్ అధికారంలోకి వచ్చాక అవన్నీ దయ్యాలకు ఆవాసాలుగా మారాయన్నారు.

అప్ప్పులుచేసి పేదలు నిర్మించుకున్న 4లక్షల 37వేల ఇళ్లను జగన్ సర్కారు రద్దుచేసిందని, ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇవ్వాల్సిన రూ.1100కోట్ల బకాయిలను నిలిపివేసిన జగన్ సర్కారు పేదలను కాల్చుకు తింటోందన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్లను బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయదన్నారు. ఏపనులు చేసినా వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటే, అందుకోసం 10 నుంచి 20 శాతం కమీషన్ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకుంటున్నాడన్నారు. పేదలు కమీషన్లు ఇవ్వరనే, వారికివ్వాల్సిన బకాయిలను నిలివేశారా అని ఉమా నిలదీశారు. ఇంతజరుగుతుంటే, బుగ్గన ఏం చేస్తున్నాడని దేవినేని ప్రశ్నించారు. నన్నయ తెలుగువిశ్వవిద్యాలయానికి చెందిన 20 ఎకరాలను మింగేస్తే, తెలుగుని ఉద్దరిస్తామంటున్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, లక్ష్మీపార్వతి ఏం గడ్డి పీకుతున్నారని ఉమా దుయ్యబట్టారు. దేశంలో ఏరాష్ట్రంలో జరగని దుర్మార్గాలన్నీ ఏపీలోనే జరుగుతున్నాయన్నారు. ప్రకాశం (కంచరగుంట), గుంటూరు, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు (అటవీభూములు), పశ్చిమగోదావరి జిల్లాల్లో భూదోపిడీ విచ్చలవిడిగా సాగుతోందన్నారు. ఇష్టరాజ్యంగా గ్రామాల్లో పేదల భూములను లాగేసుకుంటున్నారని, 25లక్షల ఇళ్ల పట్టాల్లో లెక్కకోసం, టీడీపీప్రభుత్వం ఇచ్చిన 5లక్షల పట్టాలను జగన్ ప్రభుత్వం లాగేసుకుందన్నారు.

పోలవరం పనుల్లో నిన్నటివరకు రూ.20వేలకోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేసిన జగన్, సాక్షిమీడియా, ఇప్పుడు రూ.25వేలకోట్లంటూ సరికొత్త రాగం ఆలపిస్తోందని ఉమా ఎద్దేవాచేశారు. రూ.16వేలకోట్ల ప్రాజెక్ట్ అంచనావ్యయాన్ని, రూ.57,940కోట్ల వరకు పెంచారని చేసిన ప్రచారం ఏమైందో చెప్పాలన్నారు. టీడీపీ పాలనలో పోలవరానికి పునాదులే పడలేదని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్, అదే ప్రాజెక్టు పనుల్లో రూ.25వేలకోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలన్నారు. పోలవరం పర్యటనకు జగన్ ఎందుకువెళ్లాడో... 9నెలల్లో ఎంతవరకు పనులు చేశారో.. ఎన్ని మీటర్ల మట్టిపనులు జరిగాయో, ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేశారో ఎందుకు చెప్పడంలేదన్నారు. రూ.25వేలకోట్ల అవినీతిపై పోలవరం పర్యటనకు వెళ్లొచ్చిన జగన్ నోరు తెరవాలని, సాక్షి మీడియా సమాధానం చెప్పాలని తాను ప్రశ్నించి 24 గంటలైనా ఇంతవరకు సమాధానం రాలేదని ఉమా స్పష్టంచేశారు. జగన్ మౌనంవెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలన్నారు.

Advertisements