ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో కూడా పలు రాష్ట్రాల్లో ఇవి మొరాయించాయి. దీంతో నిర్ణీత సమయం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ప్రజలు బారులు తీరాల్సి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళలలో అత్యధికంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈవీఎంలో తలెత్తిన లోపాలపై యూపీలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిర్వహణపరమైన లోటుపాట్లు ఎలా ఉన్నప్పటికీ మంగళవారం పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగానే తరలివచ్చారు.

voting 24042019

ఈసీ అధికారులు మంగళవారం రాత్రి 8 గంటలకు వెల్లడించిన సమాచారం ప్రకారం 65.61 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే, కొన్నిచోట్ల అప్పటికీ పోలింగ్‌ జరుగుతున్నందున ఓటింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం 116 లోక్‌సభ స్థానాల పరిధిలో దాదాపు ప్రశాంతంగానే పోలింగ్‌ ముగిసింది. మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మంగళవారంతో 302 లోక్‌సభ స్థానాల్లో (అనంత్‌నాగ్‌ మినహా)పోలింగ్‌ పూర్తయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈవీఎంలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళవారం ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌, భాజపా అభ్యర్థిని సినీనటి జయప్రద పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్‌ ప్రారంభకావటంతోనే ఈవీఎంలలో సమస్యలు తలెత్తటంతో 350 యంత్రాలను అప్పటికప్పుడు మార్చారు.

voting 24042019

ఓటింగ్‌ యంత్రాల నిర్వహణ లోపంపై సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈవీఎంలలోని లోపాలను సత్వరమే సరిదిద్ది పోలింగ్‌ నిర్వహించినట్లు ముఖ్య ఎన్నికల అధికారి ఎల్‌.వెంకటేశ్వర్లు లఖ్‌నవూలో తెలిపారు. కేరళలో కనీసంగా 35 చోట్ల, బిహార్‌, కర్ణాటక, గోవాలలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తటంతో ఓటర్లకు నిరీక్షణలు తప్పలేదు.గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరుగగా 63.67 శాతం మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని పలు కేంద్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా, ఆ పార్టీ అగ్రనేత ఆడ్వాణీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ వంటి ప్రముఖులు ఓటు వేశారు. కేరళలో 71.67 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌ స్థానంలో సాయంత్రం 6 గంటల సమయానికి అత్యధికంగా 76.21శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానంలో పోలింగ్‌ శాతం 73.2 మాత్రమే.

Advertisements