గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు పరుగులు పెడుతున్నాయి. పది నెలల కాలంలో సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం సేకరించిన 600 ఎకరాల భూముల్లో, ప్రస్తుతం ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులు జోరుగా జరుగుతున్నాయి. విస్తరణలో ఈ ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులే కీలకం. ఈ విస్తరణ పనుల్లో దాదాపు 70 శాతం మేర ఎర్త్‌ఫిల్లింగ్‌ పని ఉంది. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువు నుంచి మట్టిని ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ పనులు మరో రెండు నెలలు జరుగుతాయి. ఆ తర్వాత కాంక్రీట్‌ పనులు, ఆ తర్వాత బీఎం, ఎస్‌డీఏసీ, డీఏసీ విధానంలో మూడు లేయర్లతో రన్‌వేను మరింత బలోపేతం చేసే పనులు జరుగుతాయి.

విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ కోసం రూ.117 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టెండర్లు పిలిచింది. పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కాంట్రాక్టును దక్కించుకుంది. పది నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.58 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. వాస్తవానికి రన్‌వే ప్రాజెక్టు వ్యయం రూ.98 కోట్లు మాత్రమే! మిగిలిన వ్యయం జీఎస్టీ కిందకు వెళుతుంది. విస్తరణ పనులు వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. విస్తరించిన రన్‌వే వచ్చేఏడాది ప్రారంభం అవుతుంది. నూతన రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్టుగా గుర్తింపు వస్తుంది.

విశాఖపట్నం, రాజమండ్రి, చిత్తూరు ఎయిర్‌పోర్టులు కూడా విజయవాడ తర్వాత స్థానంలోనే ఉంటాయి. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించటం వల్ల విజయవాడ ప్రస్తుత రన్‌వేతో సమానంగా ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు ప్రస్తుతం 7500 అడుగులు (2286 మీటర్లు). దీనిని మరో 3500 అడుగులు (1704 మీటర్ల) మేర ప్రస్తుతం పొడిగిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు అదనపు రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో అత్యంత పొడవైన రన్‌వేగా రికార్డుకెక్కుతుంది.

Advertisements