నాలుగవ విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఎన్నికలు అయిన వెంటనే, సాయంత్రం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. రాష్ట్రం మొత్తంలో, టిడిపి, వైసీపీ మధ్య హోరా హరీగా ఫలితాలు వస్తున్నాయి. సాయంత్రం 7.30 వరకు వచ్చిన ఫలితాలు చూస్తే, తెలుగుదేశం పార్టీకి 222 పంచాయతీలు రాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 248 పంచాయతీలు వచ్చాయి. అయితే ఇంకా చాలా చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. అయితే కృష్ణా జిల్లా గన్నవరం మేజర్ పంచాయతీలో ఇప్పటి వరకు ఎలాంటి ట్రెండ్ బయటకు రాలేదు. అయితే విషయం ఏమిటి అని ఆరా తీయగా, గన్నవరంలోని పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో పెద్ద హైడ్రామా నెలకొంది. కౌంటింగ్ కేంద్రం గేట్లకు తాళాలు వేసి మరీ కౌంటింగ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. చివరకు మీడియాకు కూడా ఎటువంటి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీంతో అసలు లోపల ఏమి జరుగుతుందో, ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ముఖ్యంగా అభ్యర్ధులు, మీడియా ఈ విషయం పై ఆరా తీస్తున్నాయి. వల్లభనేని వంశీ నివాసం ఉండే ప్రాంతం కావటంతో, ఈ ఫలితం పై టెన్షన్ నెలకొంది.

Advertisements