రాష్ట్రంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగానే, గవర్నర్, కరోనా పై సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను ప్రతి ఒక్కరు పాటించాలని... రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. రాజ్​భవన్‌లో వివిధ విభాగాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 తొమ్మిది గంటల వరకు ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని కోరారు. జనతా కర్ఫ్యూ స్వయం నియంత్రణకు ఓ సంకేతమని... ప్రతిఒక్కరూ కనీసం 10 మందికి ఈ సందేశాన్ని చేరవేసి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్తంగా ఈ మహమ్మారిని కట్టడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గవర్నర్​కు వివరించారు. ఈ సమీక్షలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పాల్గున్నారు.

గతంలో వరదలు వచ్చిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన సందర్భంలో, గవర్నర్ ఇలాగే సమీక్ష చేసారు. అయితే అప్పుడు జగన్ లేరు కాబట్టి, గవర్నర్ బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు జగన్ తాడేపల్లిలోనే ఉండగా, గవర్నర్ నేరుగా అధికారులను పిలిపించుకుని, రాష్ట్రంలో కరోనా పై సమీక్ష చెయ్యటం అనూహ్య పరిణామం అనే అనుకోవాలి. అయితే ఇది సహజంగా జరిగే పరిణామం అని, దీని గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని వైసీపీ అంటుంది. జగన్ మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పడు పరిస్థితి సమీక్షిస్తున్నారని, నిన్న కూడా ప్రధాని మోడితో కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారని అంటున్నారు. అయితే ఈ రోజు మాత్రం, జగన్ ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గున్నట్టు, వార్తలు అయితే రాలేదు.

అయితే, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాత్రం, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం కావాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు... రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు ఎదుర్కోవటంపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం కల్పించే విషయంపై చర్చిస్తున్నామని, త్వరలోనే ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేస్తున్నామని మంత్రి తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ప్రయాణాలు చేయొద్దని ఆళ్ల నాని కోరారు.

Advertisements