ఆంధ్రజ్యోతి పై , జగన్ ప్రభుత్వ కక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏబిఎన్ ఛానెల్ రాకుండా చేసిన ప్రభుత్వం, తాజాగా వ్యతిరేక వార్తల పై, 24 గంటల్లో కేసులు పెట్టాలనే జీవోను ముందుకు తీసుకువచ్చింది. ఇది కూడా ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేసి తెచ్చిందే అని, నిన్నటి మంత్రి పెర్ని నాని ప్రెస్ మీట్ చూస్తే తెలుస్తుంది. మరో పక్క మొన్న జరిగిన ఏపి క్యాబినెట్ సమావేశంలో, 1986లో ఆంధ్రజ్యోతి భూములు ప్రభుత్వం స్వాధీన పరచుకుని, దానికి పరిహారంగా ఇచ్చిన భూమి విషయంలో, దాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 1986లో అప్పటి ప్రభుత్వ, విశాఖకు 17 కి.మీ దూరంలో ఉన్న, పరదేశిపాలెంలో, అన్ని పత్రికా కార్యాలయాలకు భూమి ఇచ్చినట్టే, ఆంధ్రజ్యోతి’కి 1.5 ఎకరాల భూమి కేటాయించింది. అప్పట్లో అక్కడ ఎకరం 10 వేలు. అయితే తరువాత జరిగిన హైవే విస్తరణలో, ఎకరం స్థలం పోయింది. అయితే అప్పటి నుంచి పరిహారం ఇవ్వలేదు.

highcourt 18102019 2

దీని పై ఆంధ్రజ్యోతి అప్పటి నుంచి ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉంది. చివరకు 2017 జూన్‌ 28న ఆమోద పబ్లికేషన్స్‌ ఎండీకి భూమి కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసింది. 1986లో కేటాయించిన భూమిలో మిగిలిన అర ఎకరా పక్కనే మరో ఎకరా భూమిని కేటాయిస్తూ ఆ జీవో విడుదలైంది. అయితే పరిహారంగా ఇచ్చే భూమి, ఎలాంటి చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, ప్రభుత్వ ఆదేశాల మేరకు, 50 లక్షలు ప్రభుత్వానికి చెల్లించింది. భూమి తీసుకున్న మూడేళ్ళలో, నిర్మాణం జరగాలి అనే ఒప్పందం కూడా ఉంది. అయితే మూడేళ్ళ సమయంలో, ఇప్పటికి రెండేళ్ళు అయ్యాయి, మరో ఏడాది టైం ఉంది. అయితే ఇదే సాకుగా చూసిన జగన్ ప్రభుత్వం, ఆ స్థలంలో నిర్మాణాలు ప్రారంభించనందున భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేబినెట్‌ లో తీర్మానించింది. అయితే దీని పై ఇప్పటి వరకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, క్యాబినెట్ తీర్మానం చెయ్యటంతో, ఆంధ్రజ్యోతి నిన్న ప్రభుత్వం పై హైకోర్ట్ కు వెళ్ళింది.

highcourt 18102019 3

దీని పై హై కోర్ట్ స్పందిస్తూ, భూస్వాధీనం పై ప్రభుత్వం ఏవైనా చర్యలకు ఉపక్రమించినట్లయితే చట్ట నిబంధనల మేరకు నడచుకోవాలని ఆదేశించింది. ఈ పిటీషన్ పై ప్రభుత్వ తరుపు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలను వినిపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే, కలెక్టర్ కు భూమి వెనక్కు తీసుకునే అవకాసం ఉందని చెప్పారు. ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమిలో ఇప్పటి వరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదని చెప్పారు. అయినా, ఆ భూమి స్వాధీనం పై, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగలేదని, కేవలం మీడియాలో వార్తలు చూసి భయాందోళనలతో కోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి, చట్టపరమైన నిబంధనలు పాటించకుండా ఎలాంటి చర్యలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Advertisements