గుంటూరు జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారి పై అధికార వర్గాలు ఆరా తీశాయి. మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో 30 మందిని గుర్తించారు. వారందరినీ ఐదు అంబులెన్స్ ల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు, ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో 23 మందిని కలిసినట్టు కూడా అధికారులు గుర్తించారు. వారిని కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో నమోదైన 4 కరోనా కేసుల దృష్ట్యా... గుంటూరు జోన్​ను హాట్​ స్పాట్​గా ప్రకటిస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైరస్ వ్యాప్తిని నియత్రించేందుకు అధికార యంత్రాంగం నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 4 కేసులు నమోదు కావటం దురదృష్టకరమన్న మంత్రి.. జిల్లా వ్యాప్తంగా 88 ఆస్పత్రులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆ ఆస్పత్రుల్లో 9,352 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రేషన్ సరఫరా 15 రోజులపాటు సాగుతుందని .. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిత్యావసరాల ధరలు పెంచితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు, ఈ విపత్తులో ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేయాలని కోరింది. చెక్కు రూపంలో విరాళం ఇవ్వాలనుకునేవారు 'చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్ ఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌' పేరున పంపాలని సూచించింది. ఆన్‌లైన్‌లో పంపదలచినవారు ఎస్​బీఐ అకౌంట్‌ నంబర్‌ 38588079208, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ SBIN0018884 కు పంపవచ్చని తెలిపింది. ఆంధ్రా బ్యాంకు అకౌంట్‌ నెంబరు... 110310100029039, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ ANDB0003079 కు పంపవచ్చని పేర్కొంది. వెబ్​సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా వివరాలు పంపదలచినవారు apcmrf.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.

Advertisements