తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వైద్యపథకాల పేర్లు తొలగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరును వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా సాక్ష్యాత్తు సీఎం జగన్మోహన్‌రెడ్డే ప్రకటించారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుమీద నడుస్తున్న వైద్యపథకాల పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రన్న సంచార చికిత్స, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ తదితర పథకాల పేర్ల మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. ఆ పథకాలకు ఎక్కడా ఆ పేర్లు ఉండకూడదని, తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా రక్తపరీక్షల నిర్వహణ బాధ్యతలను మెడాల్‌ సంస్థకు గత టీడీపీ ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ 2016 నుంచి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీల నుంచి రక్తనమూనాలు స్వీకరించి పరీక్షలు నిర్వహించేవారు.

health 07062019

ఇందుకోసం ఒక్కో పరీక్షకు ఇంతమేర ధర నిర్ణయించి ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లించేది. ఈ రక్తపరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని బోగస్‌ నమూనాలు, పరీక్షలు చూపించి దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారముండడంతో మెడాల్‌ సంస్థ యధాతథంగా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో మెడాల్‌ను రద్దుచే యడానికి అడుగులు వేస్తోంది. మెడాల్‌ పేరుకూడా ఎక్కడా కనిపించకూడదని జిల్లా వైద్యశాఖకు రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వైద్యపథకాల పేర్లను తొలగించే పనిలో జిల్లా వైద్యశాఖ నిమగ్నమైంది.

 

Advertisements