ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 75 శాతం స్థానిక రిజర్వేషన్ల పై, గతంలో ఎంతో వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు అన్నీ, 75 శాతం స్థానికులకే అని చెప్తూ, ఒక చట్టం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పై, జాతీయ స్థాయిలో కూడా దుమారం రేగింది. ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో, ఇంకా ఈ స్థానిక రిజర్వేషన్లు ఏమిటి, ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారా, ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అంటూ, అప్పటి నుంచే, జగన్ ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వం అని పిలవటం మొదలు పెట్టారు. అయితే, ఇప్పుడు ఏడాది తరువాత, అప్పుడు వాళ్ళు చెప్పిందే నిజం అని తేలింది. ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా, ఈ ఏడాది కాలంలో పెట్టుబడి పెట్టటానికి రాలేదు. ఉన్న కంపెనీలు కూడా, వెళ్ళిపోవటం మొదలు పెట్టాయి. వివిధ రకాల కారణాలు ఈ పరిస్థితికి కారణం అయినా, అందులో, ఈ 75 శాతం రిజర్వేషన్ కూడా ఒకటి.

స్థానికంగా ఏపిలో స్కిల్ లేదు, బయట నుంచి కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే, ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తే కాని వచ్చే పరిస్థితి లేదు. వారిని ప్రోత్సహించాలసింది పోయి, మాకే ఉద్యోగాలు ఇవ్వాలి అంటే, పెట్టుబడులు రాక, వచ్చే ఆ కొన్ని ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. అయితే, ఇదే విషయం పై, ఈ రోజు కోర్ట్ తలుపు తట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, 75 శాతం రిజర్వేషన్ అంటూ, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, విజయవాడకు చెందిన లాయర్, సీహెచ్‌. వరలక్ష్మి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ తరుపున, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వొకేట్, బి.ఆదినారాయణరావు, తమ వాదనలు వినిపించారు.

అయితే, ఈ పిటీషన్ రాగానే, ఈ పిటీషన్ స్వీకరించటానికి అర్హత లేదు, తిరస్కరించమంటూ, ప్రభుత్వ తరుపు న్యాయవాది సుమంత్‌ రెడ్డి హైకోర్ట్ ని కోరారు. పిటీషన్ వేసింది న్యాయవాదులు అని, న్యాయవాదులకు, ఇతరులకు, దీంతో సంబంధం లేదని, అవసరం అనుకుంటే పారిశ్రామికవేత్తలు స్పందిస్తారని వాదించారు. అయితే హైకోర్ట్ మాత్రం, ఈ వాదనతో అంగీకరీంచలేదు. ఈ పిటీషన్ లో, ప్రజాప్రయోజనం దాగి ఉందని, ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తున్నామని తెలిపింది హైకోర్ట్. రాజ్యాంగానికి లోబడే, ఈ 75 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నారా ? ఈ నిర్ణయానికి చట్ట బద్దత ఉందా అంటూ, హైకోర్ట్ ప్రశ్నించింది. దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, తమకు కొంత సమయం కావాలని కోరగా, నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చెయ్యాలని, కోర్ట్ ఆదేశించింది.

Advertisements