“ప్రభుత్వమే నిబంధనలు రూపొందిస్తుంది. తిరిగి ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తే ఎలా? అని హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. అమరావతిలో భూములు ఇస్తున్న తీరు పై, హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ రైతులు రాజధాని అమరావతి కోసం భూములు ఇస్తే, వాటిని వేరే వారికి ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించింది. అసలు మీకు ఆ అధికారం ఎక్కడ ఉంది అంటూ, ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరో స్థలం తీసుకుని, పేదలకు ఎలా పంచి పెడతారు ? ప్రభుత్వం భూమి ఇస్తాం అంటే మాకు అభ్యంతరం లేదు కాని, రాజధాని కోసం అని ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుని, ఇప్పుడు పంచి పెట్టటం ఏమిటి అంటూ ప్రశ్నించింది హైకోర్ట్. ఇది సీఆర్డీఏ చట్టానికే వ్యతిరేకం. బాధ్యతల నుంచి తప్పుకుని, వన్ సైడ్ గేమ్ ఆడతాం అంటే కుదరదు అంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది హైకోర్ట్. ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్న భూమి అభివృద్ధి చేసిన తరువాత, 5 శాతం భూమి పేదల గృహాలకు వినియోగిస్తాం అని చట్టంలో ఉందని కోర్ట్ గుర్తు చేసింది.

highcourt 280222020 2

ఇక్కడ అసలు అభివృద్దే జరగకుండా, అంతా ఆపేసి, ఇప్పుడు ఆ భూములు ఎలా పంచి పెడతారు అంటూ కోర్ట్ ప్రశ్నించింది. సీఆర్డీయే అధీనంలోని భూములలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీపై మార్చి 2వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్ జనరలను ఆదేశించింది. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పేరుతో సీఆర్డీయే అధీనంలోని 1,251.51 ఎకరాల భూమిని ఇంటి స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేర్వేరుగా దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. పిటీషనర్‌ తరపున ప్రముఖ న్యాయవాది అశోక్ భానుతో పాటు కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు.

highcourt 280222020 3

సీఆర్డీయే పరిధిలో బయటి వ్యక్తులకు ఇంటి స్థలాల కేటాయించటం పట్ల అశోక్ భాను అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిపై అడ్వకేట్ జనరల్ శ్రీరాం తన వాదన వినిపిస్తూ జీవో ప్రకారం ఇంటిస్థలాలు కేటాయిస్తున్న వారంతా సీఆర్డీయే పరిధిలోని వారేనని, నిబంధనల ప్రకారమే జరుగుతున్నద ని చెప్పారు. ఉగాది పర్వదినం వరకు ప్రభుత్వం ఎవరికీ పట్టాలు ఇవ్వటం లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టంచేశారు. అడ్వకేట్ జనరల్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి 2వ తేదీ వరకు గడువు ఇచ్చింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు 4వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి, కోర్ట్ ల్లో వరుస ఎదురు దెబ్బలు తింటున్న జగన్ ప్రభుత్వం, ఈ విషయంలో కూడా కోర్ట్ ఆగ్రహానికి గురయ్యారు.

Advertisements