మన నేతలు ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలోకి రావటానికి అనేక మాటలు చెప్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత, అసలు ఆ ఊసే ఎత్తరు. అప్పుడు ఇలా చెప్పావు కదా అని అడుగుదాం అంటే ప్రజల మధ్య తిరగరు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, వరదలు వచ్చిన సమయంలో, అప్పట్లో తెలుగుదేశం పార్టీ కుటుంబానికి రూ.2 వేలు, బియ్యం, పప్పులు ఇస్తే, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, వరద ప్రాంతాల్లో పర్యటన చేసి, ఇదేమిటి ఇవేమీ సరిపోతాయి, కనీసం రూ.5 వేల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి, ఇప్పటి వరకు వీరిని అధికార పార్టీ వాళ్ళు కలిసారా అంటూ ఆవేదనతో మాట్లాడిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వరదలు ఉన్నాయి. దాదాపుగా 10 రోజులగా వరదలోనే అనేక గ్రామాలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వరద గ్రామాల్లో పర్యటన చేయలేదు. ఇక సహాయం ప్రకటించింది రూ.500. దీంతో గతంలో జగన్ మోహన్ రెడ్డి 5 వేలు ఇవ్వాలి అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాటి మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారా లోకేష్ కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ, అప్పట్లో మేము చేసినంత సాయం కూడా చేయలేదని, 5 వేలు ఇవ్వాలని చెప్పిన మనిషి, 500 ఇస్తామని చేతులు దులుపుకున్నారని లోకేష్ విమర్శించారు.

Advertisements