ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో, జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. దాదాపుగా 40 నిమిషాల పాటు, ఈ సమావేశం జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం తాను లేఖ రాసిన విషయాలను ప్రధాని వద్ద ప్రస్తావించారు. రాజధానిని మూడు ముక్కలు చేసి, మూడు చోట్ల పెట్టటం పై, జగన్ మోహన్ రెడ్డి, ప్రధానికి తన అభిప్రాయాలు చెప్పి, ఈ ప్రతిపాదనకు కేంద్రం నుంచి సహాయం అడిగినట్టు సమాచారం. అలాగే, మండలి రద్దు చేసి, ఆ బిల్లుని కేంద్రానికి పంపిన అంశం కూడా జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అసెంబ్లీలో అత్యంత పెద్ద మెజారిటీ ఉన్నా కూడా, మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో, అన్ని బిల్లులు అడ్డుకుంటున్నారని, ప్రతి బిల్లు లేట్ అవుతుందని, రెండేళ్ళ పాటు, విపక్షాల బలం ఎక్కువ ఉంటుందని, అందుకే మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు జగన్, ప్రధానికి వివరించారు. మండలి రద్దు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉందని, ఆ బిల్లుని వీలైనంత త్వరగా పాస్ చెయ్యాలని కోరినట్టు తెలుస్తుంది.

ఇక పోలవరంలో రావాల్సిన బకాయాలు విషయం కూడా ప్రధాని వద్ద ప్రస్తావించారు. మూడు వేల కోట్లకు పైగా, రావల్సి ఉందని, అవి తొందరగా వచ్చేలా చూడాలని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు పై కూడా జగన్ ప్రధానిని కోరినట్టు తెలుస్తుంది. ఇలా అన్ని విషయాల్లో కేంద్రం సహకారం కోరారు. అయితే ఈ సమయంలోనే ప్రధాని వైపు నుంచి కూడా కొన్ని ప్రశ్నలు రావటంతో, సమావేశం హాట్ హాట్ గా మారిపోయింది. ముఖ్యంగా దావోస్ సదస్సులో, పీపీఏ ల సమీక్ష విషమై, వివిధ పారిశ్రామిక వేత్తలు లేవనెత్తిన అభ్యంతరాలను, ప్రధాని మోడీ జగన్ వద్ద ప్రస్తావించారు. పీపీఏల రద్దు విషయమై పారిశ్రామిక వర్గాల్లో ఉన్న ఆందోళనను, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ప్రధానికి వివరించిన సంగతి తెలిసిందే. ఇదే విషమై, ప్రధాని, జగన్ ను వివరణ కోరినట్టు సమాచారం.

అలాగే కియా మోటార్స్ విషయంలో, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల పై కూడా ప్రధాని మోడీ, జగన్ వివరణ కోరినట్టు తెలుస్తుంది. ఇక నరేగా నిధులు, కేంద్రం విడుదల చేసినా, రాష్ట్రం ఎందుకు విడుదల చెయ్యలేదు అనే విషయం పై కూడా, ప్రధాని వివరణ కోరారు. మొత్తంగా, జగన్ వినతులు, ప్రధాని ప్రశ్నలతో, ఈ సమావేశం ముగిసింది. ఇది ఇలా ఉంటే, జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ శుక్రవారం ఢిల్లీ వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరగా, అయన బిజీగా ఉండటంతో, శుక్రవారం అపాయింట్మెంట్ ఇస్తాను అని చెప్పినట్టు సమాచారం. దీంతో జగన్ మోహన్ రెడ్డి మరో సారి శుక్రవారం ఢిల్లీ వెళ్లి, కేంద్రం హోం మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారని, వార్తలు వస్తున్నాయి.

Advertisements