అసెంబ్లీలో తనపార్టీవారితో కలిసి జగన్‌ గానా భజానా నిర్వహించాడని, మంత్రి ధర్మానప్రసాదరావు రాజకీయవేత్తగా కంటే, సినిమాదర్శకుడిగా బాగా పనికొస్తాడని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మంగళగిరి లోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో వై.ఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనావికేంద్రీకరణ చేయాలన్న ఆలోచన ఆనాడు మంత్రులుగా ఉన్న బొత్స, ధర్మానలకు ఎందుకు రాలేదన్నారు. విభజనానంతర రాష్ట్రానికి రాజధాని అనేది అత్యంత కీలకమని, ఒకనగరం కొత్తగా నిర్మితమవడం వల్ల రాష్ట్రానికి వచ్చే అవకాశాలు, పరిశ్రమలు, తద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందన్నారు. ధర్మాన, బొత్స, జగన్‌లకు నిజంగా వెనుకబడిన ప్రాంతా లను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధే ఉంటే, రాజధాని శ్రీకాకుళంలో పెట్టాలని జలీల్‌ ఖాన్‌ సూచించారు. బొత్స, ఆయన కుటుంసభ్యులు ఇదివరకే ఉత్తరాంధ్రలో ఎక్కడా కొండల్ని, వాగులు-వంకల్ని కూడా వదలకుండా తినేశారన్నారు. జగన్‌ను పొగిడినంత మాత్రాన బొత్స, ధర్మానలు ముఖ్యమంత్రులయిపోరన్నారు. రాష్ట్రవిభజనవేళ విభజన కు అంగీకారం తెలిపినబొత్స, నాడు ఏపీకి సీఎం కావాలని కుట్రలు పన్నాడన్నారు.

మంత్రులకు, జగన్‌ని ప్రశ్నించే ధైర్యంలేదని, అసెంబ్లీ చెప్పిందానికల్లా మండలి సభ్యులు తలాడించడంలేదనే పెద్దలసభను రద్దుచేశారన్నారు. జగన్‌తప్పులను ప్రశ్నించడమే మండలిసభ్యుల నేరమైపోయిందన్నారు. 8నెలలుపూర్తయినా ఇప్పటివరకు జగన్‌ సాధించింది ఏమీలేదన్నారు. చంద్రబాబు పాలనలో రాజధానికేంద్రంగా లెక్కకుమిక్కిలి పనులు జరిగాయని, అవన్నీచర్మం మందంగా ఉన్నవారికి కనిపించవ న్నారు. ఒక్కఛాన్స్‌ ఇవ్వండంటూ ఆనాడు బతిమాలిన జగన్‌, తన 8నెలలపాలనలో 40వేలకోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని అథోగతిపాలు చేశాడన్నారు. ఏదోగాలివాటంగా గెలిచినవాళ్లంతా తామంతా నాయకులని చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్‌లో ఉండి ఏమీ మిగలకుండా రాష్ట్రాన్ని నాకేసినవారంతా ఇప్పుడు జగన్‌పంచనచేరారని, వారికి ఎంతబలముందో స్థానికఎన్నికల్లో తేలుతుందన్నారు. జగన్‌ మగాడయితే, రాజధాని తరలింపు నిర్ణయాన్ని రిఫరెండంగా తీసుకొని రాష్ట్రంలో ఏదోఒకస్థానంలో ఎన్నిక నిర్వహించి, తనసత్తా ఏమిటో ప్రజలకు చూపించాలని జలీల్‌ఖాన్‌ సవాల్‌విసిరారు.

అన్నాక్యాంటీన్లు మూసేసి, వాటిని గ్రామసచివాలయాలుగా మార్చిన జగన్‌ నిర్ణయాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, వాలంటీర్లకు ఇచ్చే రూ.5వేలు చాలక వారు ప్రజల సొమ్ముని దోచేస్తున్నారన్నారు. అమరావతి రూపురేఖల్ని, రాజధానిలో జరిగిన పనుల్ని ఏనాడూ కన్నెత్తికూడా చూడని జగన్‌, అసలు అక్కడేమీ జరగలేదని ఎలా చెబుతాడన్నా రు. వైసీపీ చెంచాలకు భూమ్మీద కాళ్లు నిలవడంలేదని, ప్రభుత్వం ఉందికదా అని తోకజాడిస్తే చూస్తూ ఊరుకోబోమని జలీల్‌ఖాన్‌ హెచ్చరించారు. ఆంధ్రాపోలీసులు పనికిరారని చెప్పిన జగన్‌, ఇప్పుడు వారినే అడ్డుపెట్టుకొని బతుకుతున్నాడన్నారు. రాష్ట్రం విడిపోవడానికి మూలకారకుడు జగన్మోహన్‌రెడ్డని, తనఎదుగుదలకోసం ఆనాడు సోనియాగాంధీతో ఆయన సంప్రదింపులు జరిపి, అవి విఫలంకావడంతోనే విడిగాపార్టీ పెట్టాడన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీ.ఏ.ఏకి వ్యతిరేకంగా కేరళ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌సహా, 12 రాష్ట్రాలు తీర్మానం చేశాయని, ముస్లింల ఓట్లతో గెలిచిన జగన్‌, ఆదిశగా అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని జలీల్‌ఖాన్‌ నిలదీశారు.

ఇప్పుడు జగన్‌కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బొత్స, గతంలో వై.ఎస్‌.విజయ మ్మను ఉద్దేశించి ''ఏయ్‌ విజయా.. నీకొడుకు దొంగ, నువ్వుచెప్పావని నీకొడుకుని ముఖ్యమంత్రిని చేయాలా..'? అని నోటికొచ్చినట్లు మాట్లాడాడని, ఆయన చెప్పిందంతా నాటి అసెంబ్లీలో రికార్డయిందని జలీల్‌ఖాన్‌ తెలిపారు. రాష్ట్రవిభజనను గుడ్డిగా సమర్థించిన వారిలో ఆనాడు బొత్సనే ముందున్నాడని చెప్పారు. రాజకీయాల్లో తప్పొప్పులు సహజమని, కానీ, కక్షసాధింపులు, వేధింపులకుపాల్పడటం రాష్ట్రంలో ఇప్పుడే చూస్తున్నామన్నారు. వైసీపీప్రభుత్వంలో అన్నివర్గాలప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వాహనమిత్ర పేరుతో ఆటోవాళ్లకు డబ్బులుఇచ్చినట్లే ఇచ్చి, కేసుల రాసి, అంతరకు రెట్టింపు వసూలు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నిధుల్ని అమ్మఒడికి తరలించడం ఎలాంటి పాలనో చెప్పాలన్నారు. దూరదృష్టి, ఆలోచ న, విశాలధృక్పథం ఉన్నవాడెవడూ దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోడని, అక్కడి జీవనవిధానం ఎలా ఉంటుందో జగన్‌కు తెలుసునా అని జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు. జగన్‌ను అడ్డుపెట్టుకొని వైజాగ్‌ను తిమింగలంలా మింగేయడానికి బొత్స ప్రయత్నిస్తున్నా డన్నారు. లోకేశ్‌ ఓటమిని గురించి మాట్లాడేవారంతా, విజయమ్మ ఓటమిపై ఏం సమాధానం చెబుతారని జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు.

Advertisements