ప్రపంచం అంతా ఈ మహమ్మారి వైరస్ పై యుద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ఎప్పుడూ ఏదో ఒక వివాదమే నడుస్తూ ఉంటుంది. రాజధాని మార్పు కాని, ఎన్నికలు కాని, ఎన్నికల కమీషనర్ ను మార్చటం కాని, రంగులు కాని, ఇలా ఏదో ఒక వివాదం. తాజాగా ఎల్జీ పాలిమర్స్ వివాదం. ఎల్జీ పాలిమర్స్ విషయంలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారని, అందుకే ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు అనే చర్చ నడుస్తున్న వేళ, రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రి కొత్త సమస్య పుట్టుకు వచ్చింది. అదే పోతిరెడ్డిపాడు నీటి వివాదం. అటు తెలంగాణాలో కేసీఆర్, హరీష్ రావు, ఇతర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. మా నీళ్ళు తీసుకు వెళ్ళిపోయే ప్రాజెక్ట్ కు మేము ఒప్పుకోం అంటూ, విమర్శలు మొదలు పెట్టారు. ఇక ఇటు వైపు నుంచి జగన్ మోహన్ రెడ్డి, మా నీళ్ళు మేము వాడుకుంటాం, దాంట్లో తప్పు ఏమి ఉంది, మానవత్వంతో ఆలోచించండి అంటూ వ్యాఖ్యలు చెయ్యటం చూస్తున్నాం. అయితే ఉన్నట్టు ఉండి ఈ వివాదం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

అయితే ఇది కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుతున్న డ్రామా అంటూ, తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వైఫల్యాలు గురించి ప్రజలను డైవర్ట్ చేసే పనిలో భాగంగానే ఇవి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేసీఆర్-జగన్ ఇద్దరు సోడా-విస్కీ లాగా కలిసిపోయారని, ఇదంతా డ్రామా అని, ఏపి ఇచ్చిన ఆ నీటి జీవో, ప్రగతి భవన్ లో తాయారు అయ్యిందే అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే దీని పై విశ్లేషకులు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపి చేపట్టింది కొత్త ప్రాజెక్ట్ కాదు, అది కూడా కేవలం ఒక 10 రోజులు వరదలు వస్తే పని చేసే ప్రాజెక్ట్. ఒక్కే ఏడాది అసలు వరదలు కూడా రావు. అలాంటి విషయంలో ఇంతలా గొడవ ఎందుకు అవుతుందో అర్ధం కావటం లేదని అంటున్నారు.

గతంలో చంద్రబాబు ఉండగా, ఇదే శ్రీశైలం పై, ముచ్చుమర్రి కట్టారని, అప్పుడు తెలంగాణాతొ సమన్వయం చేసుకున్నారని, అలాగే, 2017లోనే, ఇదే పోతిరెడ్డిపాడు వద్ద, అప్రోచ్ ఛానల్ extension, వైడనింగ్ చేసారని, అప్పుడు ఎలాంటి వివాదం తెలంగాణాతో రాలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం పోతిరెడ్డి పాడు కాలువలు వెడల్పు చేస్తున్నారని, ఇదేమీ కొత్త ప్రాజెక్ట్ కాదని, మరి దీనికి జగన్ "రాయలసీమ ఎత్తిపోతల" అని ఏదో కొత్త ప్రాజెక్ట్ లా ఎందుకు చెప్పారు ? దానికి కేసీఆర్ ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్ధం కావటం లేదని, అంటున్నారు. ఏమి లేని సమస్యను, ఏదో సమస్యగా చూపిస్తున్నారని, అసలు జగన్ ఇప్పుడు చేసేది ఏదో పెద్ద ప్రాజెక్ట్ కూడా కాదని, 10 రోజులు వరదలు వస్తే ఉపయోగపడే దానికి , ఇంత హడావిడి ఏమిటో అనే విమర్శలు వస్తున్నాయి. ఇక మరో పక్క తెలంగాణాలో కడుతున్న కాళేశ్వరం , పాలమూరు ప్రాజెక్టులలో, వైసీపీ పెద్ద తలకాయలు కాంట్రాక్టరులుగా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

Advertisements