రాయలసీమను రతనాలసీమగా మలిచే నీటి ప్రాజెక్టులు చకచకా పూర్తవుతున్నాయి. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మూడు కీలక పథకాలను ప్రారంభించనున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్ఎస్)లో అంతర్భాగమైన అవుకు సొరంగం, గోరకల్లు, పులికనుమ ఎత్తిపోతల పథకాలను ఆయన జాతికి అంకితమివ్వనున్నారు. అలాగే, ఇస్కాల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చెయ్యనున్నారు. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. 12 ఏళ్లుగా ఎన్నో అవరోధాలు.. వీటన్నిటినీ అధిగమించి అవుకు సొరంగంలోని కుడివైపు జంట టన్నెళ్ల నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం పూర్తిచేసింది.

cbn 22092018 2

అదే రోజు నుంచి 10 వేల క్యూసెక్కులు గండికోట రిజర్వాయర్‌కు టన్నెల్‌ నుంచి మళ్లించేలా జలవనరుల శాఖ ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో ఈ సొరంగం ఎంతో ముఖ్యమైనది. కడప జిల్లా గండికోట జలాశయానికి కృష్ణా జలాల తరలింపునకు ఇదే కీలకం. గాలేరు-నగరి 30వ ప్యాకేజీలో భాగమైన అవుకు జంట సొరంగాల ప్రాజెక్టుకు అంచనా విలువతో రూ.451.81 కోట్లుగా జల వనరుల శాఖ రూపకల్పన చేసింది. ఈ జంట సొరంగాల పొడవు ఒక్కోటీ సుమారు 5.75 కిలోమీటర్లు. 57.70 నుంచి 63.45 కిలోమీటర్ల దాకా ఉండే ఈ సొరంగాల నుంచి 20,000 క్యూసెక్కుల వరద నీటిని గండికోటకు తరలించడం లక్ష్యం.

cbn 22092018 3

అయితే ఎడమ టన్నెల్‌లో 500, కుడి టన్నెల్‌లో 600 మీటర్లు ఫాల్ట్‌ జోన్‌ (పైనుంచి మట్టిపెళ్లలు విరిగిపడడం) ఏర్పడింది. ఫాల్ట్‌జోన్‌ కారణంగా టన్నెల్‌ నిర్మాణం కష్టమని.. బైపాస్‌ టన్నెళ్లు నిర్మించాలని నిపుణులు సూచించారు. దాంతో మొదట కుడి టన్నెల్‌లో ఫాల్ట్‌ జోన్‌ ఏర్పడిన ప్రాంతం వద్ద గోడ కట్టి అక్కడి నుంచి 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు బైపాస్‌ టన్నెల్స్‌ నిర్మాణం తలపెట్టారు. నిరుడు ఒక బైపాస్‌ టన్నెల్‌ పూర్తిచేసి 5 వేల క్యూసెక్కులు గండికోటకు తరలించారు. ఈ ఏడాది రెండో బైపాస్‌ టన్నెల్‌ పూర్తయింది. ఈ మళ్లింపు సొరంగాల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని అవుకు జలాశయం ద్వారా గండికోట జలాశయానికి పంపే ఏర్పాటు చేశారు. ఎడమ టన్నెల్‌ కూడా పూర్తయితే 20 వేల క్యూసెక్కులను గండికోటకు తరలించడం సాధ్యమవుతుంది.

Advertisements