విశాఖపట్నంలోని ఎల్​జీ పాలిమర్స్ కంపెనీ వద్ద మరోసారి స్థానికులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమ గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పరిశ్రమ గేటు వద్ద మృతదేహాలతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. స్థానికులు గేటు వద్ద ధర్నాకు దిగడంతో డీజీపీ లోపలే ఉండిపోయారు. దాంతో డీజీపీ చుట్టూ రక్షణ వలయంగా పోలీసులు ఏర్పడ్డారు. గ్రామస్థులను నియంత్రించి డీజీపీని పోలీసుల పంపేశారు. పరిశ్రమలోకి రాకుండా స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని సీపీ మీనా పర్యవేక్షిస్తున్నారు.

నేతలు, అధికారులు పరిశ్రమను చూసి వెళ్లిపోతున్నారు తప్ప..ఎవరూ బాధిత గ్రామాల్లోకి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత 5 గ్రామాల ప్రజల బాగోగులు చూడటం లేదన్న వారు...కనీసం తమకు ఆహారం, తాగునీరు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు వచ్చి 5 గ్రామాల కష్టాలు వినాలని కోరారు. పరిశ్రమను మూసివేస్తామని యాజమాన్యం ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పరిశ్రమ యజమానులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. తమ ఆగ్రహం చల్లారేందుకు మాత్రమే ఈ కమిటీ వేశారని వారు పేర్కొన్నారు. ఆ కమిటీలో ఉన్న అధికారులు సాంకేతిక నిపుణులు కాదన్నారు. కంపెనీ మూసివేత ప్రకటన వస్తేనే స్థానికులు శాంతిస్తారన్నారు. 5 బాధిత గ్రామాల్లో వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisements