అమరావతి 300 రోజుల ఉద్యమం సందర్భంగా నారా లోకేష్, ఈ రోజు అమరావతిలో పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన వివిధ శిబిరాల్లో పాల్గున్నారు. వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గుని, ప్రసంగించారు. తన కార్యక్రమం ముగుసిన తరువాత, అయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇటీవల న్యాయ వ్యవస్థ పై జగన్ రాసిన లేఖ గురించి లోకేష్ వద్ద ప్రస్తావించగా, లోకేష్ ఇలా స్పందించారు. "నేను దీని మీద స్పందించదలుచుకోలేదు. వాళ్ళు ఏమి చేయాలి అనుకుంటున్నారో, మనకు అర్ధం అవుతుంది. మన దౌర్భాగ్యం కాకపొతే, 16 నెలలు జైలుకి వెళ్ళినవాడు, 11 సిబిఐ కేసులు తన పై పెండింగ్ ఉన్న వాడు, అలాగే 28 వరకు 420 కేసులు ఉన్న వ్యక్తి, సిబిఐ, ఈడీ, ఫేమా, ఇలా అన్ని రకాల వైట్ కాలర్ నేరాలు చేసిన వ్యక్తిగా అతని ట్రాక్ రికార్డు ఉంది. ఇలాంటి వ్యక్తులు, ఇన్ని కేసులు వారి వెనుక పెట్టుకుని, ఇలాంటి వారు న్యాయవ్యవస్థ పై దాడి చేస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం మాత్రమే కాదు, దేశ సమగ్రతకే ఇలాంటి వారు ముప్పు. " అని లోకేష్ అన్నారు.

ఇక అలాగే అమరావతి ఉద్యమం పై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కూడా లోకేష్ స్పందించారు. గత 300 రోజులుగా అమరావతి ప్రజలు పిల్లా పాపలతో, ఉద్యమం చేస్తుంటే, ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదని, వీరి వద్దకు వచ్చి, మీ బాధలు ఏంటి అని అడగలేదని, ఒక్క మంత్రి కానీ, చివరకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాలేదని లోకేష్ అన్నారు. రాకపోగా, రైతులను అవమానపరుస్తున్నారని, బూతులు తిడుతున్నారని, వారిని పర్సనల్ గా తిడుతున్నారని, ఇది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని, వారి పోరాటానికి ఎప్పుడూ మద్దతు ఉంటుందని లోకేష్ అన్నారు. అమరావతి పై అనేక ఆరోపణలు చేసారని, ఈ 16 నెలల్లో ఒక్కటంటే ఒక్క ఆరోపణ అయినా రుజువు చేయలేక పోయారని లోకేష్ అన్నారు. అమరావతి అనేది ఒక మంచి మోడల్ సిటీ అని, మన దేశానికీ ఈ శతాబ్దిలో నిర్మాణం అవుతున్న, మంచి మోడల్ సిటీ అని, ఇలాంటి అమరావతిని నిర్వీర్యం చేయకుండా, నిర్మాణం చేయాలని అన్నారు.

Advertisements