ఇటీవల బలవన్మరణాలకు పాల్పడిన స్వర్ణకారుల కుటుంబాలను గురువారం ఉద‌యం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ పరామర్శించారు. పనుల్లేక, ఆర్థిక ఇబ్బందుల‌తో ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ వెంగలశివ కుటుంబసభ్యులను పరామర్శించారు. స్వ‌ర్ణ‌కార వృత్తిలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన యేకులభాస్కర్ (బాచి) కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించారు. 50 వేల రూపాయిల ఆర్ధిక సహాయం అందించారు. స్వర్ణకారుల ఆత్మహత్యలు,స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం స్వర్ణకార సంఘం పెద్దలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఉపాధి లేక స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. స్వర్ణకారులను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా స్వర్ణకార కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

lokesh 21112019 2

స్వర్ణకార వృత్తిని కొనసాగించే విధంగా,ఆర్థిక సహాయం,లోన్స్ ఇప్పిస్తాం,ఇన్సూరెన్స్ కల్పిస్తామని అన్నారు. వైద్య సేవలు,పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. స్వర్ణకారుల పై పెడుతున్న అక్రమ కేసులు ఎదుర్కోవడానికి న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా కోపరేటివ్ సొసైటీ పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పై విలేఖరులు అడిగిన ప్రశ్నల పై స్పందిస్తూ, "చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. వారి పై ఇప్పటికి రెండు సార్లు స్పందించాను. ఇక అన్నీ వెంకన్న స్వామే చూసుకుంటారు. గతంలో ఆయన జోలికి వెళ్తే ఏమి అవుతుందో చరిత్ర చెప్పింది. ఆయనను ఈ బుతుల్లోకి లాగితే, వెంకన్న స్వామికి ఏమి చెయ్యాలో తెలుసు" అని స్పందించారు.

lokesh 21112019 3

అలాగే, తెలుగు మీడియం రగడ పై కూడా స్పందించారు. "తెలుగుదేశం పార్టీ హయాంలోనే మున్సిపల్స్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం.అప్పుడు విద్యార్థులకు అప్షన్ ఇచ్చాం. మేము ఇంగ్లీష్ మీడియం వద్దు అనడం లేదు.మాతృ భాష లేకుండా చేయాలన్న నిర్ణయాన్ని మాత్రమే మార్చుకోవాలని అడిగాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒక్కటే అప్షన్ విద్యార్థులకు,తల్లిదండ్రులకు ఇవ్వండి ఏ మీడియం కావాలో వారే నిర్ణయించుకుంటారు. బలవంతంగా మీ ఆలోచనల్ని విద్యార్థులపై ప్రయోగించకండి. మాతృ భాష లేకుండా చేస్తాం అనడం కరెక్ట్ కాదు. తెలుగు రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో నాకు బాగా తెలుసు. విదేశాల్లో ఎక్కువ కాలం చదవడం వలన తెలుగు నేర్చుకోలేకపోయాను. ఎప్పుడైనా ఒక పదం తప్పు పలికితే నన్ను ఎంత ఎగతాలి చేసారు అందరికి తెలుసు. అందుకే మాతృభాష కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను." అని లోకేష్ అన్నారు.

Advertisements