తెలుగుదేశం పార్టీలో కిందిస్థాయి నేతలు, బూత్‌ స్థాయి సానుభూతిపరులు, పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు, అభిమానులకు వైసీపీ కాల్‌ సెంటర్‌నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఐటీ గ్రిడ్‌నుంచి తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకుని వైసీపీకి ఇచ్చిన డేటా వల్లే ఇది జరుగుతోందని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. గత రెండురోజుల్లో అలా వైసీపీ కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్లు రాగా.. వాటిని రిసీవ్‌ చేసుకున్న తెలుగుదేశం నేతలు, అభిమానులు కొందరు ఆయా కాల్స్‌ను రికార్డు చేసి, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ కాల్‌సెంటర్‌ నుంచే ఈ ఫోన్లు వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. జగన్ ను కలవండి, మీ జీవితం మారిపోతుంది అంటూ, ఆ కాల్స్ సారంశం.

lotuspond 07032019

ఉదాహరణకు ఒకకాల్‌లో.. ‘మీలా సమాజసేవ చేసేవారికి జగన్‌ స్వయంగా లేఖలు రాస్తున్నారు. మీకు రాలేదంటున్నారుగా’ అని టెలీకాలర్‌ అడగ్గా.. ‘ఎవరు జగన్‌ రాస్తున్నారా? నేను విజయవాడ అర్బన్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడిని. మీరు కూడా తెలుగుదేశాన్ని బలపర్చాలని కోరుతున్నా’ అని ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం అభిమానులు ఇలా కాల్స్‌ రిసీవ్‌ చేసుకుని.. కాలర్‌ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ‘‘మా నంబరు మీకెక్కడిది? నా పేరు మీకెలా తెలిసింది? నేను సమాజసేవ చేస్తానని మీకెవరు చెప్పారు ? మా వివరాలు ఎలా వచ్చాయి?’’ అని ప్రశ్నలు గుప్పిస్తుండడంతో కాలర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక తెలుగుదేశం అభిమానికి ఫోన్‌చేసి.. ‘‘జగన్‌ను కలవాలనుకుంటున్నారా?’’ అని కాలర్‌ అడగ్గా.. నాకేం పని అంటు అతను సమాధానమిచ్చాడు. అసలు తన ఫోన్‌ నంబరు ఎవరిచ్చారు? ఎక్కడిది? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

lotuspond 07032019

జగన్‌ మాయా రాజకీయం మన రాష్ట్రంలో చెల్లదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో తమపై కేసులు పెట్టిస్తున్నారని, తమ డేటా దొంగిలించి ఓట్లు వేయాలని తమకే ఫోన్లు చేస్తున్నారని తప్పుపట్టారు. వైకాపా నుంచి ఫోన్లు చేసేవారిని నిలదీయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తమ నెంబర్ ఎవరిచ్చారని వారిని ప్రశ్నించాలని సూచించారు. తెదేపా డేటా ఎందుకు చోరీ చేశారని నిగ్గదీయాలని, దొంగలకు ఓట్లు ఎందుకు వేస్తామని ధైర్యంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలో అన్నిపార్టీలకు యాప్‌లు ఉన్నాయని, కానీ తెదేపా యాప్‌పైనే దుష్ప్రచారానికి తెగబడ్డారని దుయ్యబట్టారు.

Advertisements