వైరస్ పై పోరులో కఠిన నిర్ణయాలతో కష్టపడ్డ దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా పేదలు తనను మన్నించాలని కోరారు. అయితే.. కరోనా వైరస్తో పోరును చావు-బతుకుల పోరాటంగా అభివర్ణించిన మోదీ.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు. 'మనసులో మాట' కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. వైరస్ను తొలినాళ్లల్లోనే అరికట్టాల్సిన ఆవ్యశ్యకత ఉందన్నారు. ఇందుకు భారతీయులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 'భయపడాల్సిన అవసరం లేదు..' కరోనా నుంచి కోలుకున్న ఓ హైదరాబాద్ వాసితో మోదీ సంభాషించారు. తనకు వైరస్ సోకినట్టు తెలిసిన తర్వాత.. కొంత భయపడ్డానని, కానీ వైద్యులు తనలో ధైర్యాన్ని నింపారని తెలిపారు ఆ వ్యక్తి. భయపడాల్సిన అవసరం లేదని.. కోలుకునే అవకాశాలే ఎక్కువని హైదరాబాద్వాసి ధీమాగా చెప్పారు.

తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ఆ హైదరాబాద్వాసిని మోదీ కోరారు. ఇది వైరల్ అయితే.. ప్రజల్లో అవగాహనతో పాటు ధైర్యం కూడా పెరుగుతుందన్నారు. వైద్యుల సూచనలు పాటించిన హైదరాబాద్​ వాసి.. కరోనాను జయించారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైరస్​ నుంచి కోలుకున్న ఆగ్రావాసితోనూ మోదీ మాట్లాడారు. ఆయన కుటుంబం మొత్తానికి వైరస్​ సోకింది. ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎలా ఎదురొన్నారని ఆ వ్యక్తిని మోదీ ప్రశ్నించారు. వైద్యులు తమను బాగా చూసుకున్నారని.. తమలో భరోసా నింపారని. అందరం ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని ఆ ఆగ్రావాసి వివరించారు. ఇలా వైరస్​ను జయించిన వారి కథలు.. దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారాలని మోదీ ఆకాంక్షించారు.

కరోనాపై పోరాటంలో వైద్యులకు కేంద్రప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్​కీ బాత్​లో భాగంగా పలువురు వైద్యులతో ఫోన్​లో సంభాషించారు. కరోనాతో యావత్ దేశం యుద్ధం చేస్తున్న సమయంలో వైద్యులందరూ సైనికుల్లాగా పోరాడుతున్నారని కొనియాడారు. రోగులకు వైద్యంతో పాటు మనోధైర్యాన్ని నింపేలా.. కౌన్సెలింగ్​ కూడా ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు ప్రధాని. దిల్లీకి చెందిన డాక్టర్ నితీశ్​ గుప్తాతో ఫోన్​లో మాట్లాడారు మోదీ. ఈ సందర్భంగా.. ఇతర దేశాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్యను చూసి చాలా మంది భయపడుతున్నారని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని ప్రధానికి వివరించారు డాక్టర్ గుప్తా.

Advertisements