పార్టీ లైన్ దాటవద్దు. విజయసాయి రెడ్డికి చెప్పకుండా, ఆయన సలహాలు తీసుకోకుండా, ఢిల్లీలో, ప్రధాని కాని, ఇతర మంత్రుల్ని కలవద్దు. పార్టీ లైన్ ధిక్కరిస్తే, ఎవరికైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి, పక్కన పెడతాం. ఇది శనివారం, 23 మంది వైసిపీ ఎంపీలకు జగన్ ఇచ్చిన వార్నింగ్. అయితే రెండు రోజులు కూడా కాక ముందే, 23 మంది ఎంపీలలో, 7-8 మంది ఎంపీలు, ఈ రోజు కీలక సమావేశానికి డుమ్మా కొట్టటం, వచ్చిన వారిలో కొందరు ధిక్కార స్వరం వినిపించటంతో, ఒక్కసారిగా వైసిపీ అధిష్టానం, షాక్ కు గురైంది. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అనే విషయం పై, ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ పార్లమెంటేరీ పార్టీ నేత హోదాలో, ఎంపీలు అందరినీ తన ఇంట్లో, సమావేశానికి ఆహ్వానించారు. అయితే 23 ఎంపీలకు గాను, 7-8 మంది ఎంపీలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఏకంగా విజయసాయి రెడ్డి పిలిచిన మీటింగ్ కే, ఎంపీలు రాకపోవటంతో, ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతంది. ఇలా ఎందుకు జరిగింది అని ఆరా తీస్తున్నారు.

mp 19112019 2

ఇక వచ్చిన ఎంపీలు, తమ అసహనాన్ని విజయసాయి రెడ్డి దగ్గర వెళ్లగక్కారు. ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అన్ని పనులు ఎమ్మెల్యేలే చేస్తున్నారని, తమను లెక్క చెయ్యటం లేదని, అధినేత కూడా, ఎమ్మేల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎంపీలు విజయసాయి రెడ్డి దగ్గర వాపోయినట్టు సమాచారం. అలాగే తమకు పార్టీ తరుపున ఎదురు అవుతున్న వివిధ సమస్యలను విజయసాయి రెడ్డికి చెప్పుకున్నారు. ముఖ్యంగా తమకు ఏమి చేయలన్నా, ఎమ్మెల్యేల అనుమతి తీసుకుని చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని, తమ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఎంపీల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే, తమకు సరైన ప్రొటోకాల్‌ కూడా ఇవ్వటం లేదని, ఏకరవు పెట్టరు. ఇలా అయితే ఇక మేము ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేసారు.

mp 19112019 3

ఈ సమస్యను జగన్ వద్దకు తీసుకువెళ్ళి పరిష్కారం చెయ్యాలని కోరారు. అలాగే, జాతీయ స్థాయిలో, తమ పాలన పై వస్తున్న కధనాలను ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో, ఏపి ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని, జాతీయ పత్రికల్లో వస్తున్న కధనాలతో, పరువు పోతుందని వాపోయారు. మనం చేసే మంచి పనులు, జాతీయ స్థాయిలో వచ్చేలా ప్రణాళికలు వెయ్యాలని, విజయసాయి రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు, జగన్ పై వ్యతిరేకంగా మాట్లాడితే, అడ్డుకోవాలని తమ ఎంపీలకు తెలిపారు. మరో పక్క సగం మంది ఎంపీలు మీటింగ్ కి దుమ్మా కొట్టటం పై, టిడిపి విమర్శలు దాడి మొదలు పెట్టింది. సగం మంది ఎంపీలు పక్క దారి చూస్తుంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు కొత్త సియం కోసం ఎదురు చూస్తున్నారని, అందుకే మా పై బూతు పురాణం అందుకున్నారని, దేవినేని ఉమా విమర్శించారు.

Advertisements