మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రీజియన్ల వారీగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం పూట అధికారులతోనూ, రాత్రి వివిధ రాజకీయ పక్షాలతోనూ ఆయన సమావేశం కానున్నారు. ప్రత్యేకంగా గుర్తించబడిన కొన్ని ప్రాంతాల్లో, ఎన్నికల కోడ్ను సక్రమంగా అమలు చేసేందుకు స్వేచ్ఛా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం కోరనున్నారు. ఈనెల 27, 28, మార్చి 1వ తేదీన ఆయన పర్యటన వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన తిరుపతిలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన అధికారులతోనూ, రాజకీయ పక్షాలతోనూ ఆయన సమావేశం కానున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 3.15 నిమిషాల నుండి 5.30 గంటల వరకూ అధికారుల తోనూ, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో రాజకీయ పక్షాలతోనూ భేటీ కానున్నారు. అక్కడే బసచేసి మరుసటిరోజు అనగా ఫిబ్రవరి 28న విజయవాడకు చేరుకోనున్నారు. అక్కడ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులతో మధ్యా హ్నం 3.15 నుండి 5.30 వరకూ సమీక్ష నిర్వహించి, సాయంత్రం రాజకీయ పక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఇక మార్చి 1వ తేదీన విశాఖ చేరుకుని అక్కడ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల
అధికారులతో సమావేశంకానున్నారు.

రాత్రికి రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించనున్నారు. అధికారులతో సమీక్షలో భాగంగా మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల నియమావళి అమలు, ఫోటో గుర్తింపు కార్డులు, అత్యధికంగా ఓటర్లు పాల్గొనేలా చేయడం వంటి అనేక రకాల అంశాలపై ఆయన కూలంకుశంగా చర్చించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటన కొనసాగేదిలా.. హైదరాబాద్ నుండి ఈ నెల 27న మధ్యాహ్నం 1.15 గంటలకు విమానంలో బయలుదేరి 2.15 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా సమావేశానికి హాజరవుతారు. ఆరాత్రికి అక్కడే బసచేసి మరుసటి రోజు అనగా 28వ తేదీ మధ్యాహ్నం 12.20కు రేణిగుంట విమానాశ్రయం నుండి విమానంలో బయలుదేరి 1.20 గంటలకు గన్నవరం విమానా శ్రయానికి చేరుకుంటారు. విజయవాడలో ఏర్పాటుచేసిన అధికారులు, రాజకీయ పక్షాలనేతల సమావేశంలో పాల్గొంటారు. ఆ రాత్రికి అక్కడే బసచేస్తారు. మార్చి 1వ తేదీన గన్నవరం విమానశ్రయం నుండి బయలుదేరి మధ్యామ్నం 1.20 గంటలకు విశాఖ చేరుకుని అక్కడ సమావేశాల్లో పాల్గొంటారు. అదేరోజు రాత్రి 10.45కు విమానంలో బయలుదేరి 12.15కు హైదరాబాద్ చేరుకుంటారు.

Advertisements